29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

పెండింగ్ ఫీజు రీయింబర్స్‌ మెంట్ వెంటనే విడుదల చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బి.రఘురాం

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌ మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, జూలై 23న జిల్లాలో నిర్వహించనున్న “విద్యార్థుల పోరు” బహిరంగ సభను విజయవంతం చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య జిల్లా కార్యదర్శి బి.రఘురాం అన్నారు. ఈ మేరకు ఆదివారం నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలోని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యాలయంలో సభ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌ మెంట్ కింద సుమారు రూ.8 వేల కోట్ల బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించేందుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, మరికొందరు మధ్యలోనే చదువులు నిలిపివేయాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్య ప్రతి విద్యార్థి రాజ్యాంగబద్ధమైన హక్కు అని పేర్కొంటూ, పేద విద్యార్థులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను సకాలంలో విడుదల చేయడంలో విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బకాయిలన్నింటినీ విడుదల చేయడంతో పాటు, ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేసే విధంగా శాశ్వత వ్యవస్థను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని, విద్యను ప్రైవేటీకరణ దిశగా నెట్టే విధానాలను విరమించుకోవాలని కోరారు. ప్రభుత్వ, సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించి, విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి, మౌలిక సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం జూలై 23న నిజామాబాద్ నగరంలో నిర్వహించనున్న “విద్యార్థుల పోరు” భారీ బహిరంగ సభలో విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని రఘురాం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సుభోద్, రాష్ట్ర సమితి సభ్యురాలు అనుషా, జిల్లా సహాయ కార్యదర్శి కుషాల్, జిల్లా నాయకులు కిషోర్, గణేష్, హాసిని, శివ పవన్, అజేష్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article