- 161 జాతీయ రహదారిపై వరుస ప్రమాదాలు
- నిద్రావస్థలో హైవే పెట్రోలింగ్ సిబ్బంది
బతుకమ్మ, బిచ్కుంద : జాతీయ రహదారి ఎన్ హెచ్ 161 కు ఆనుకుని ఉన్న కందర్ పల్లి రద్దీగా ఉండే ప్రాంతం అని అందరికి తెలిసిన విషయమే. వేల సంఖ్యలో వాహనాలు తిరుగుతూ ఉంటాయి. దీని వల్లనే రహదారి పక్కన పదుల సంఖ్యలో హోటళ్లు, దాబాలు వెలిశాయి. నిర్వాహకుల దందా కూడా బానే సాగుతూ ఉంటుంది. ఇదంతా బానే ఉన్నా హోటళ్లు, దాబాల నిర్వహకులు పార్కింగ్ విషయంలో నిబంధనలు పాటించడం లేదు అనే ఆరోపణలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా హోటళ్లు వద్ద ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్డుపైన బారులు తీరుతున్నాయి. కంటెయినర్‌లను, కార్లను ఇతర వాహనాలను ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తున్నా పంటించుకునే వారు లేరనడంలో ఎలాంటి సందేహం లేదని స్థానికులు అంటున్నారు.
వాస్తవానికి వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా స్థలాన్ని ఆయా యాజమాన్యాలు కేటాయించాలి కానీ మనల్ని అడిగేది ఎవరు అన్నట్టుగా నిర్వాహకులు చూస్తూ చూడనట్టు దందాలను సాగించడం కొసమెరుపు. దీంతో వాహనాల రద్దీ పెరిగి ఇతర వాహనాలు వెళ్లడానికి ఇబ్బందికరంగా మారి ప్రమాదాలు సంభవిస్తున్నాయని అధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు కోకొల్లలుగా వెల్లువెత్తుతున్నాయి. కందర్పల్లి, పత్లాపూర్ తదితర గ్రామాల్లో హోటళ్లు, దాబాలు చాలానే వున్నాయి. వీటిలో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనాలు చేయడానికి కొందరు. జ్యూస్, చాయ్ తాగడానికి వచ్చేవారు మరికొందరు. చాలా దూరం వాహనాలను నడపడం వల్ల కొద్దిగా సేద తీరడానికి హోటళ్ల ముందు ఆగేవారు ఇంకొందరు. వారి వాహనాలను పార్కింగ్ చేసుకోవడానికి ఆయా హోటళ్ల యాజమాన్యాలు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలి. కానీ ఎక్కడా ఈ నిబంధనను అమలు చేయడం లేదు. ఒకటి రెండు వాహనాలు మాత్రమే పార్కింగ్ చేయడానికి స్థలం ఉంటుంది. మిగిలిన వాహనాలను జాతీయ రహదారిపై టూవీలర్ వెళ్లే రోడ్డు పై ఆపుతున్నారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఒక్కో హోటల్ వద్ద అధిక సంఖ్యలో భారీ వాహనాలు నిలిచి ఉంటున్నాయి. దీనివల్ల ఆ మార్గంలో రాకపోకలు సాగించే ఇతర వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. రాత్రిపూట కొంతమంది డ్రైవర్లు ఇండికేటర్లు ఆన్‌చేయకుండా వాహనాలను రోడ్డు పక్కన పార్కింగ్ చేస్తుండడంతో వెనుక నుంచి వచ్చే వాహనాలు ముందు ఏ వాహనం ఉందో తెలియక ఢీకొనే పరిస్థితి నెలకొంది. గతంలో ఈ విధంగా అనేక ప్రమాదాలు జరిగిన సంఘటన 161 జాతీయ రహదారిపై జరిగాయి. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి హైవే పై అధికారులు నిరంతరం గస్తీ తిరుగుతుంటారు. కానీ హోటళ్ల ముందు ఇష్టారాజ్యంగా పార్కింగ్ చేసిన భారీ వాహనాల గురించి పట్టించుకోవడం లేదని చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారన్న మటలు బలంగా వినిపిస్తున్నాయి. జంక్షన్ వద్ద చాటుగా ఉండి చలాన్లు వేయడంలో ఉన్న ఆసక్తి దాబాలు, హోటళ్ల వద్ద నిబంధనలకు విరుద్ధంగా నిలుపుదల చేస్తున్న భారీ వాహనాల డ్రైవర్ ల పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ సమస్యను నియంత్రించాలంటే అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ నిబంధలను పాటించని హోటల్ యాజమాన్యాలకు నోటీసులు ఇవ్వాలని కోరుతున్నారు.

