30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

అందుబాటులోకి మన ఇసుక వాహనం ఆన్లైన్ బుకింగ్ యాప్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . జిల్లాలో ప్రయోగాత్మక అమలుకు శ్రీకారం

 

. . . మ్యానువల్ విధానానికి ఇకపై చెల్లుచీటీ

 

. . . ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా ఇసుక కేటాయింపు

 

. . . కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఇసుక అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్తగా ప్రవేశపెట్టిన మన ఇసుక వాహనం ఆన్లైన్ బుకింగ్ యాప్ విధానాన్ని నిజామాబాద్ జిల్లాలో అందుబాటులోకి తెచ్చామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. శనివారం ఆమె సబ్ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, మైనింగ్, గ్రౌండ్ వాటర్ తదితర శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఈ నూతన విధానం అమలుకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. మ్యానువల్ విధానానికి స్వస్తి పలుకుతూ, ఇక నుండి పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే ఇసుక బుకింగ్ చేసుకునేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వెల్లడించారు. ప్రయోగత్మకంగా నిజామాబాద్ జిల్లాలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టినందున, పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యేలా అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. ఇసుక అవసరమైన వారందరూ ఆన్లైన్ బుకింగ్ యాప్ ను సద్వినియోగం చేసుకునేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, రవాణా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ సూచించారు. ‘మన ఇసుక వాహనం’ యాప్ ద్వారా ఆన్‌లైన్ లో ఇసుక బుకింగ్ విధానం వల్ల మధ్యవర్తుల ప్రమేయం లేకుండా  వినియోగదారులకు మరింత పారదర్శకంగా, నేరుగా ఇసుక అందుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాల కోసం లబ్దిదారులకు ఉచితంగా ఇసుకను కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ఇసుక లోడింగ్, విలేజ్ ఫండ్ కింద ఒక ఇసుక ట్రాక్టర్ లోడ్ కు కేవలం 612 రూపాయలను మాత్రమే ఇందిరమ్మ ఇళ్ళ లబ్దిదారులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇతర గృహ నిర్మాణదారులు, ప్రభుత్వ పనులకు అవసరమైన ఇసుక కోసం 1173 రూపాయలు చెల్లించాలన్నారు. ఆన్లైన్ లోనే యూ.పీ.ఐ పేమెంట్ చేయాలని సూచించారు. అయితే ఇసుక తరలింపు కోసం వినియోగదారులే ట్రాక్టర్ వాహనాన్ని సమకూర్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్న వినియోగదారులు ప్లేస్టోర్ నుండి మన ఇసుక వాహనం యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని నేరుగా ఇసుక బుకింగ్ చేసుకోవచ్చని సూచించారు. ఆ వివరాలు పంచాయతీ కార్యదర్శికి చేరుతాయని, ఆయన వాటిని పరిశీలించి తహసిల్దార్ కు ఫార్వార్డ్ చేస్తారని అన్నారు. ఇసుక పరిమాణంకు అనుగుణంగా యూపీఐ ద్వారా చెల్లింపు ప్రక్రియను పూర్తి చేసిన అనంతరం డిజిటల్ విధానంలో క్యూఆర్ కోడ్ ద్వారా అనుమతి మంజూరు చేస్తారని తెలిపారు. స్మార్ట్ ఫోన్లు లేని వారు గ్రామ పంచాయతీ కార్యదర్శులని సంప్రదించి వారి లాగిన్ ద్వారా ఇసుక బుకింగ్ చేసుకోవచ్చని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యానువల్ రసీదులు, అనుమతులు ఇవ్వకూడదని అధికారులకు సూచించారు. ఇసుకను ట్రాక్టర్ ద్వారానే తీసుకేల్లెందుకు అనుమతించాలని, టిప్పర్లు, లారీలు వంటి వాహనాలకు అనుమతి లేదని అన్నారు. అదేవిధంగా ఇసుక రీచ్ లలో కూడా జే.సీ.బీలు, డోజర్లు వంటి యంత్రాలను వినియోగించకూడదని, కూలీల ద్వారానే ట్రాక్టర్ ట్రాలీలో నిర్ణీత పరిమాణం మేరకు ఇసుక లోడింగ్ చేయాలని సూచించారు. మన ఇసుక వాహనం ఆన్లైన్ బుకింగ్ విధానం అమలు కోసం జిల్లాను ఎంపిక చేసినందున అధికారులు నిబద్ధతతో పనిచేసి నూటికి నూరు శాతం విజయవంతం అయ్యేలా చొరవ చూపాలన్నారు. తహశీల్దార్లు పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని, ఆర్డీవోలు కట్టుదిట్టమైన పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ ఆదేశించారు. టెలీ కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, బోధన్ ఆర్మూర్ సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, మైనింగ్ శాఖ ఏ.డీ జి.సంజయ్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

 

Our sand vehicle online booking app is available

More articles

Latest article