మామూళ్ల ‘మామ్లాలు’

0 99,891
  • కల్తీ కల్లు దందాలో అంతా సిస్టమేటిక్
  • కుల సంఘాలకు, వీడీసీలకు చెల్లింపులు
  • అసోసియేషన్ కు ఇంత.. అధికారికి మరికొంత
  • ప్రజాప్రతినిధులకు, రాజకీయ పార్టీలకూ ఫండింగ్
  • అడుగడుగునా పంపకాలు.. అమాయకుల జీవితాలతో చెలగాటాలు

 

నిజామాబాద్, బతుకమ్మ: అడుగడుగునా డబ్బులు వెదజల్లుతూ కల్తీ కల్లు వ్యాపారం చేస్తున్న వారు ఉమ్మడి జిల్లాను శాసిస్తున్నారు. వేళ్ల మీద లెక్క పెట్టే సంఖ్యలో ఉన్న వ్యాపారులు వందల మంది గౌడ కులస్తుల లైసెన్సులను చెరబట్టి సొసైటీల పేరుతో యథేచ్ఛగా కల్తీ కల్లు వ్యాపారం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ఏ మాత్రం విలువ ఇవ్వని కల్తీ కల్లు వ్యాపారులు కుల సంఘం నుంచి రాజకీయ పార్టీ వరకు అందరికీ డబ్బులు ముట్టజెప్పుతూ దందా చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో కల్లు మామ్లాలు మామూళ్ల మయమయ్యయి. దీంతో ఏ స్థాయిలోనూ కల్తీ కల్లు అరికట్టే చర్యలు కనిపించడం లేదు. ఉమ్మడి జిల్లాలో ప్రజలకు అవసరమైన రేషన్ ( ఈత, తాటి) చెట్లు లేవన్నది జగమెరిగిన సత్యం. కల్లు డిపోల్లో ( మిని ఫ్యాక్టరీల్లో) తయారయ్యే కల్లుకు, గీత కార్మికులు గీసే కల్లుకు పొంతన ఉండదని, ఆబ్కారి శాఖకు చెప్పే రికార్డులకు అసలు సంబంధం ఉండదనే విషయం అందరికీ తెలిసిందే. కల్లు కాంట్రాక్టర్లు (ముస్తేదార్లు) ఇచ్చే మామూళ్లకు అలవాటు పడిన అధికారులు కల్తీ కల్లు మాఫియాను పెంచి పోషిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గత నెలలో కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో కల్తీ కల్లు బారిన పడి 40 మంది అస్వస్థతకు గురయ్యారు. అలాగే  కల్లులో మత్తు ( డోస్ ) తక్కువైందని దానికి అలవాడిని గాంధారి మండల వాసులు ఆగమాగం చేశారు. ఆబ్కారీ శాఖ కేసులు నమోదు చేసి ముస్తేదారులను జైలుకు పంపినా మళ్లీ కల్తీ కల్లు తయారీ, విక్రయాలు ఆగడం లేదు.

  • సొసైటీల ముసుగులో భారీ దందా..

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బట్టీల్లో లభించేది అంతా కల్తీ కల్లు ( క్రుత్రిమ) అనేది అందరికి తెలిసిందే.  గౌడ కులస్తులు చాలా మంది ఇప్పటికే గీత వృత్తిని వదిలేయగా, కొందరు మాత్రమే దానిపై ఆధారపడి  జీవిస్తున్నారు. అయితే కల్లు కాంట్రాక్టర్లు సహకార సొసైటీ ముసుగులో గీత వృత్తికి సంబంధం లేని బడా బాబుల ద్వార కల్తీ కల్లు దందాను విస్తరించారు. గీత వృత్తిపై ఆధారపడిన వారి లైసెన్సులను పోగు చేసి ఫలాన గ్రామాల్లో రేషన్ ( ఈత, తాటి ) వనాలను లీజుకు తీసుకుని అక్కడ గీసిన కల్లును విక్రయిస్తామని లైసెన్సులు పొందుతున్నారు. లైసెన్స్ చేతికి అందడమే ఆలస్యం కల్లుడిపోలు ( మినీ ఫ్యాక్టరీలు) ఏర్పాటు చేసి అక్కడ నిషేధిత మత్తు పదార్థాలు డైజోఫాం, క్లోరో ఫాం చివరకు అత్యంత ఖరిదైన నిషేధిత మత్తుపదార్థం అల్ప్రాజోలంను వినియోగించి కల్లును లీటర్లకు లీటర్లు తయారు చేసి బట్టీల్లో విక్రయిస్తున్నారు. మద్యం కన్నా తక్కువ ధరకు రూ.10 మొదలుకొని రూ.20కే మత్తెక్కించే కల్లు లభిస్తుండడంతో ప్రజలు అలవాటు పడి మత్తుకు బానిసలవుతున్నారు.

  • గ్రామాల్లో కల్లు బట్టీలు

ఉమ్మడి జిల్లాలోని కొన్ని గ్రామాలు మినహా దాదాపు అన్ని గ్రామాల్లో కల్లు బట్టీలు ఉన్నాయి. నాలుగైదు ఊళ్లకు కలిసి ఒక డిపో (కల్లు తయారీ కేంద్రం) ఉన్నాయి. మండల కేంద్రాలతోపాటు పట్టణాలు, నిజామాబాద్ నగరంలో ఫ్యాక్టరీలను తలదన్నే రీతిలో డిపోలు ఉన్నాయి. అక్కడ నిత్యం లక్షల విలువ చేసే కల్తీ కల్లు తయారవుతోంది. ఇంత జరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోకపోవడానికి కారణం మామూళ్లే..  ముస్తేదారులుగా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు కల్లు తయారీలో భాగస్వాములు కాగా, ఆ కల్తీ కల్లు తాగేది, మత్తుకు బానిసలు అయ్యేది, ప్రాణాలు పోగొట్టుకునేది పేదలే.  వారి గురించి అడిగే నాథుడే లేడు.

  • అడుగడుగునా పైసల్..

ఉమ్మడి జిల్లాలో లక్షల లీటర్ల కల్లు తయారవుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడానికి ప్రధాన కారణం అడగడుగునా పకడ్బందీగా ‘పైసల’ మేనేజ్ మెంట్ కొనసాగడమే. గ్రామాల్లో సంవత్సరానికి కుల సంఘాల వారీగా డబ్బులు ఇవ్వడంతోపాటు వీడీసీలకు ఇంత అంటూ ఇస్తున్నారు. దీంతో గ్రామాల్లో కల్లు తయారీపై ప్రశ్నించే వారే లేకుండాపోతున్నారు. అసోసియేషన్ లకు, అధికారులకు, చిన్న పెద్ద స్థాయి ప్రజాప్రతినిధులకు ఇలా ఎవ్వరినీ కాదనకుండా కల్లు కాంట్రాక్టర్లు డబ్బులు ముట్టజెప్పుతుండడంతో కల్తీ కల్లు దందా ‘మూడు సీసాలు.. ఆరు పెట్టెలుగా’ సాగుతోంది. ఉమ్మడి జిల్లాలో 365 రోజూలు కల్తీ కల్లు తయారవుతోంది. కరోనా కాలంలో మత్తు కల్లు లేక చాలా మంది పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడంతో అధికార యంత్రాంగం కల్లు విక్రయాలకు అనుమతి ఇవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. చివరకు మాముళ్లు ఇచ్చే సొసైటీలు తమ ఓటు బ్యాంకును బూచీగా చూపడం, ప్రజా ప్రతినిధులకు పార్టీ ఫండ్ ను అందించే స్థాయికి చేరడంతో మత్తు కల్లు తయారీ, విక్రయాల దందా యథేచ్ఛగా సాగుతోంది. కల్తీ కల్లు తయారీలో ప్రజా ప్రతినిధులకు, పలువురు అధికారులకు వాటాలు ఉన్నాయని, దీంతో ఎటువంటి ఘటన జరిగినా రెండు మూడు రోజుల్లో దాన్ని కనుమరుగు చేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.