- జమ్మూ టార్గెట్గా పాకిస్తాన్ డ్రోన్ దాడులు..
- తిప్పికొట్టిన భారత్
ఢిల్లీ, బతుకమ్మ : భారత్ – పాకిస్థాన్ మధ్య యుద్ధం మొదలైనట్టేనా అంటే.. ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఔననే అనిపిస్తుంది. ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో జమ్మూలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భారత్ మెరుపు దాడులతో బిక్కచచ్చిన పాకిస్థాన్.. తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. జమ్మూ లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది. అయితే సర్వసన్నద్ధంగా ఉన్న భారత సైన్యం పాక్ దాడుల్ని తిప్పి కొడుతోంది. సత్వారీ, సాంబా, ఆర్ఎస్ పురా, ఆర్నియా సెక్టార్లలో పాక్ క్షిపణి దాడులకు పాల్పడింది. పాక్ ప్రయోగించిన ఎనిమిది మిస్సైల్స్ ను భారత సైన్యం వీరోచితంగా కూల్చేసింది. అఖ్నూర్, కిష్త్వార్, సాంబా సెక్టార్ లో అధికారులు పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. జమ్మూ వ్యాప్తంగా సైరన్లు మోగిస్తున్నారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. సరిహద్దు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో బ్లాక్ అవుట్ పాటించారు. జమ్మూతో సహా పఠాన్ కోట్, ఉధమ్ పూర్ లలో ఈ దాడులు జరుగుతున్నట్లు సమాచారం. మరోవైపు సాంబా జిల్లాలో పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడుతున్నట్లు సమాచారం. పలుచోట్ల భారీగా శబ్ధాలు వినిపిస్తున్నాయి. అఖ్నూర్ సెక్టార్ సహా పలు ప్రాంతాల్లో సైరన్లు మోగుతున్నాయి. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జమ్మూ, కుప్వారా సహా పలు చోట్ల కరెంటు నిలిపివేశారు. మరోవైపు పాక్ దాడులను భారత సైన్యం తిప్పికొడుతోంది. గగన తల రక్షణ వ్యవస్థలతో డ్రోన్ దాడులను నిర్వీర్యం చేస్తోంది. జమ్మూ యూనివర్సిటీకి సమీపంలో రెండు డ్రోన్లను ధ్వంసం చేసినట్లు సమాచారం.

- జమ్మూ కాశ్మీర్, పంజాబ్ లో హై అలర్ట్..
భారత్ – పాక్ లో తాజాగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వేళ జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థలు భద్రతా దళాలపై ఆత్మాహుతి దాడులకు పాల్పడవచ్చని నిఘా వర్గాలు అంచనా వేశాయి. దీంతో జమ్మూ కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో హై అలర్ట్ జారీ చేశారు. దీంతో ఆయా రాష్ట్రాల్లోని ఆలయాలు, నీటి ప్రాజెక్టుల్నీ అప్రమత్తం చేశారు.
- ఈ జిల్లాలో కరెంట్ బంద్..
పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లాలో రాత్రిపూట విద్యుత్ నిలిపివేయాలని కేంద్రం ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ‘గురుదాస్ పూర్ జిల్లా వ్యాప్తంగా రాత్రి 9గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5గంటల వరకు పూర్తి కరెంటు నిలిపివేయాలి. ఆసుపత్రులు, సెంట్రల్ జైళ్లకు వీటి నుంచి మినహాయింపు ఉంది. అయినప్పటికీ నిర్దేశించిన సమయంలో జైలు, ఆసుపత్రుల కిటికీలు మాత్రం ఖచ్చితంగా మూసి ఉంచాలి. అత్యవసర పరిస్థితులు ఎదుర్కోవడంలో భాగంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇవి అమల్లో ఉంటాయి’ అని ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది. ఏదైనా అత్యవసర పరిస్థతి తలెత్తితే ఎదుర్కొనేందుకు వీలు ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.