. . . పట్టా పాస్‌బుక్ ద్వారా నేరుగా సరఫరా చేయాలి
. . . ఆర్ఎస్ పీ జిల్లా కన్వీనర్ కటారి రాములు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
జిల్లాలో అమలవుతున్న ఆన్‌లైన్ యూరియా విధానం కారణంగా నిరక్షరాస్యులైన, సాంకేతిక పరిజ్ఞానం లేని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, యూరియా ను పాత పద్దతి లోనే పంపిణీ చేయాలని ఆర్ఎస్ పీ జిల్లా కన్వీనర్ కటారి రాములు అన్నారు. రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియా కొనుగోలు సమయంలో స్టాక్ లేకపోవడం, సర్వర్ సమస్యలు తలెత్తడం వంటి కారణాలతో రైతులు ఎరువుల కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని అన్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొంతమంది దళారులు అదనపు చార్జీలు వసూలు చేస్తూ, యూరియాతో పాటు లిక్విడ్ ఎరువులు తప్పనిసరిగా కొనాలని ఒత్తిడి తెస్తూ రైతులపై అక్రమంగా నిలువు దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. అందువల్ల యూరియా కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆన్‌లైన్ విధానాన్ని రద్దు చేసి పట్టా పాస్‌బుక్ ఆధారంగా రైతులకు నేరుగా యూరియా సంచులు అందించే విధానం అమలు చేయాలని ఆర్ఎస్ పీ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా ఎరువులు అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పిట్ల. నరేష్, గోపాల్ సింగ్ ఠాగూర్, నగేష్ లు పాల్గొన్నారు.
