. . . విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిష్కారం
. . . నిజామాబాద్ సర్కిల్ ఎస్ఈ పి.వి.రాజేశ్వర్ రావు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
విద్యుత్ వినియోగదారులకు మరింత నాణ్యమైన సేవలు అందించడంతో పాటు క్షేత్రస్థాయి ఉద్యోగుల భద్రతను పటిష్టపరిచేందుకు విద్యుత్ విభాగం ఒక మైలురాయి చర్య ఎల్సీ (లైన్ క్లియర్) యాప్ అని నిజామాబాద్ సర్కిల్ సూపెరింటెండెంట్ ఇంజనీర్ పి.వి.రాజేశ్వర్ రావు తెలిపారు. ఈ యాప్ విద్యుత్ రంగంలో పనిచేసే సిబ్బంది భద్రతకు అత్యంత కీలకంగా మారిందని అన్నారు. తప్పుడు ఫీడర్ ఎంపిక, పంపిణీ వ్యవస్థపై అస్పష్టత, సమాచార లోపం, మాన్యువల్ ప్రక్రియలో జాప్యం తదితర కారణాల వల్ల పలు సందర్భాలలో విద్యుత్ ఉద్యోగులు తీవ్రమైన ప్రమాదాలకు గురవుతున్నారని, వీటన్నింటీకి పరిష్కార మార్గం ఎల్సీ యాప్ అని వివరించారు. ఈ యాప్ ద్వారా లైన్ క్లియర్ అనుమతులు పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జారీ అవుతాయన్నారు. సిబ్బంది పని చేయవలసిన ఫీడర్, పంపిణీ లైన్ వివరాలు యాప్‌లో స్పష్టంగా ప్రదర్శితమవుతాయన్నారు. తప్పుడు ఫీడర్ ఎంపికకు అవకాశం లేకుండా వ్యవస్థ అప్రమత్తం చేస్తుందన్నారు. అధికారులు,సిబ్బంది మధ్య రియల్‌టైమ్ సమాచార మార్పిడి సాధ్యమవుతుందన్నారు. ప్రతి ఎల్సీ జారీ, వినియోగం, రద్దు వివరాలు డిజిటల్‌గా నమోదు అవుతాయని పారదర్శకత పెరుగుతుందన్నారు. విద్యుత్ భద్రతకు పెద్దపీట వేశామని, ఉద్యోగుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రతి ఒక్కరు ఎల్సీ (లైన్ క్లియర్) యాప్ వాడాలని కోరుతున్నామని చెప్పారు. ఎల్సీ (లైన్ క్లియర్) యాప్ ఉపయోగించడం వలన సంస్థ తరుపున నుండి సిబ్బందికి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా కాపాడకుంటున్నామని కేవలం ఎల్సీ (లైన్ క్లియర్) యాప్ ద్వారానే సాధ్యమైందని అన్నారు. సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తీసుకున్న చర్యల వలన జవాబుదారీతనం పెరిగిందని, అంతరాయాలు తగ్గినాయని, సమర్థవంతమైన పర్యవేక్షణ కనపడుతుందని, సిబ్బంది పని ప్రదేశాలలో సులభంగా, సౌకర్యవంతంగా పని చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
