- ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు విరాజ్
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వున్న తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్ల ప్రత్యేక బడ్జెట్ కెటాయించాలని ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షులు విరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఏఐఎస్ఎఫ్ తెలంగాణ యూనివర్సిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో, ఆర్ట్స్ కాలేజ్ ముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విరాజ్ పాల్గొని మాట్లాడారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తూ, విద్యా ప్రైవేటీకరణ, విద్యా కాషాయీకరణను అమలు చేస్తున్నారని విమర్శించారు. విద్యార్థులు పోరాడి సాధించుకున్న తెలంగాణలో సైతం ప్రజా ప్రభుత్వం అని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, కనీసం విద్యాశాఖ మంత్రి నియమించలేదని అన్నారు. ప్రభుత్వ యూనివర్సిటీల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. టీచింగ్ , నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ చేయాలని, లేదంటే యూనివర్సిటీలకు భవిష్యత్తు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పేరుతో నిజామాబాద్ జిల్లాలో ఉన్న తెలంగాణ యూనివర్సిటీలో మౌళిక సదుపాయాలు లేవని, మెడికల్ ఎమర్జెన్సీ వస్తే నర్స్, డాక్టర్ లేరని, ఎమర్జెన్సీ వాహనం కూడా లేదని ఆరోపించారు. తెలంగాణ యూనివర్సిటీతో రాష్ట్రంలో వున్న ప్రభుత్వ యూనివర్సిటీల పరిరక్షణ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర యూనివర్సిటీల ఇంచార్జ్ రెహమాన్, నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రఘురాం, తెలంగాణ యూనివర్సిటీ ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు భరత్, యూనివర్సిటీ కన్వీనర్ సంజీవ్, కో కన్వీనర్ చందు, సాయి, అజయ్, భార్గవి, మోక్షిత్, భీమేష్, ప్రభాస్, పీర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.