యూనివర్సిటీల్లో పార్ట్ టైం వద్దు.. కాంట్రాక్టు ముద్దు

0 1,215
  • పార్ట్ టైం లెక్చరర్స్ డిమాండ్
  • సీఎంకు ప్రత్యేక వినతి
  • ఎన్నికల హామీపై గంపెడాశలు
  • ప్రజాస్వామ్యబద్దంగా నిరసనలు

అయ్యా!
గౌరవ ముఖ్యమంత్రి గారు..

మేము తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విశ్వ విద్యాలయాల్లో పని చేస్తున్న పార్ట్ టైం లెక్చరర్లం. పీహెచ్డీలు చేసి, నెట్, సెట్ అర్హత పరీక్షలు రాసి, ఆచార్య నియామక అర్హతలు పొందిన అభ్యర్తులం. తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీల విద్యార్థులుగా ఉద్యమించిన బిడ్డలం. స్వరాష్ట్ర సాధనలో యుక్త వయస్సు కోల్పోయి, నీళ్ళు, నిధులు, నియామకాలు జరుగుతాయని ఆశ పడ్డ తెలంగాణవాదులం. వయస్సు మితి మీరుతున్న తెలంగాణ సాధన కోసం కదం తొక్కిన విద్యార్థి సైనికులం. రకరకాల నిర్బంధాలతో, నిబంధనలతో ఇబ్బందులు పడ్డా నిజాయితీగా ఉద్యమించిన వీరులం. స్వరాష్ట్ర సిద్ధించినా సకాలంలో శాశ్వత నియామకాలు చేపట్టకపోయినా కోర్టు కేసులతో అన్యాయమైన అభ్యర్టులం. బోధన వృత్తియే దైవంగా భావించి భవిష్యత్తు తరాలను తయారు చేసే బాధ్యతగల పౌరులం. బోధనపై మమకారంతో శాశ్వత నియామకాలు జరగకున్నా పార్ట్ టైం లెక్చరర్లుగా చేరి ఇష్టమైన వృత్తి కోసం పరితపించే ప్రాణులం. ఏళ్లుగా అరకొర వేతనాలే ఇస్తున్నా జీవనం కష్టమవుతున్నా వృత్తి కోసం బాధను దిగమింగుతున్న బాధితులం. మాతోటి శాశ్వత, కాంట్రాక్టు ప్రొఫెసర్లే మమ్మల్ని పార్ట్ టైం లెక్చరర్లు అంటూ అవహేళన చేస్తున్నా, మీకేం అధికారాలు ఉండవంటూ హింసిస్తున్నా, నాన్ టీచింగ్ సిబ్బంది మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నా, కష్ట నష్టాలను, బాధ, దుఃఖాలను దిగమింగి డ్యూటీ నిర్వహిస్తున్న నిబద్దులం. కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టోలో చెప్పినట్టు అధికారంలోకి రాగానే మమ్మల్ని కాంట్రాక్టు ప్రొఫెసర్లుగా గుర్తించి మినిమం టైం స్కేల్ అమలు చేస్తారని మాలోని అసమానతలు తొలగిస్తారని ఆశ పడ్డ ఆశా జీవులం. మా మొక్కులు ఫలించి మీరొచ్చారని, మా సారొచ్చారని సంబర పడుతున్న యూనివర్సిటీ సార్లం. మేడంలం. అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు మా గురించి మాట్లాడుతూ….వివిధ పేర్లతో పిలుస్తున్న పార్ట్ టైం టీచింగ్ వ్యవస్థ వద్దు. అందరిని కలిపి కాంట్రాక్టు వ్యవస్థ కిందకు తెద్దామని, సమాన పనికి సమాన వేతనం ఇద్దామని మీకు సూచిస్తే మురిసిన గురువులం. తప్పో ఒప్పో తెలియదు. ఆర్థిక ఇబ్బందుల సుడిలో, అవమానాల జడీలో, జీవన పోరాటంలో కొంత పోరుబాట పట్టిన పోరు బిడ్డలం. మాకిచ్చిన హామీ నెరవేర్పు కోసం, మా జీవితాలు బాగుపర్చే కోసం, అందరిని కలిసిఆర్జీలు పెట్టుకున్న హక్కుదారులం. మీరొచ్చాక ఎక్కని మెట్టు లేదు. మొక్కని ప్రజా ప్రతినిధి లేడు అన్నట్టు వినతులతో బాధలు, డిమాండ్లు వివరిస్తున్న బోధ”కులం” మేము పెట్టుకున్న ఆర్జీకి ప్రజా భవన్ నుంచి పిలుపొచ్చి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, ప్రజా భవన్ ఓఎస్డి దివ్య మాతో చర్చించి మిమ్మల్ని తొందరలోనే కాంట్రాక్టు ప్రొఫెసర్లుగా గుర్తిస్తామని మాటిస్తే, సమాన పనికి సమాన వేతనం కల్పిస్తామని హామీ ఇస్తే సంతోషంలో తేలుతున్న సామన్యులం.  కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలేదని తెలిసినా, రాష్ట్ర బడ్జెట్ లోటని హెచ్చరిస్తున్నా, ఆర్థిక సమస్యలు అడ్డంకిగా కనిపిస్తున్నా, బతుకు బండి సాగించాలనే స్వార్థంతో న్యాయం అడుగుతున్న సగటు మనుషులం. విద్యావేత్తలుగా మేము కూడా అన్నింటిని ఆలోచిస్తున్నాం. మీపై ఆశతోనే పోరాడుతున్నాం. మమ్మల్ని కరుణించి మాకు వరమిచ్చి మా దేవుడిగా మారుతావని ఆశిస్తున్నాం సీఎం స్వామి.

కెంపుల నాగరాజు
జిల్లా అధ్యక్షులు
తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్.

Leave A Reply

Your email address will not be published.