. . . డైలీ కలెక్షన్ పేరిట వసూలు
. . . అధిక వడ్డీలకు రొటేషన్
పిట్లం, బతుకమ్మ :
జీరో చిట్టి వ్యాపారస్తులు రోజురోజుకు చిట్టి ల నిర్వహణలో కొత్త పుంతలు వెతుకుతున్నారు. ఆదాయమే లక్ష్యంగా కొనసాగుతున్న ఈ జీరో చిట్టీల వ్యాపారంలో నిర్వాహకులు వ్యాపారస్తుని లక్ష్యంగా చేసుకొని నిర్వహించే చిట్టీలలో వారిని సభ్యులుగా చేసుకుంటూ చిట్టికి సరిపడ సొమ్మును రోజువారి కలెక్షన్ రూపంలో వారి దగ్గర నుండి వసూలు చేసుకుంటున్నారు. ఈ విధానంతో ఆగక ఇలా వసూలు చేసిన డబ్బులను సంత నిర్వాహకులకు, రోడ్డు సైడ్ వ్యాపారస్తులకు అధిక వడ్డీకి డబ్బులు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విధానంలో కొన్ని పర్యాయాలు అధిక వడ్డీకి తీసుకున్న వ్యాపారస్తులు చేతులు ఎత్తేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. దీంతో చేసేది లేక చిట్టి నిర్వాహకులు సైతం తమకు సకాలంలో డబ్బులు వస్తాయని చిట్టీలు వేసిన వారికి పంగ నామాలు పెడుతున్నారు.
. . . చేతులెత్తేసిన రిజిస్టర్ చిట్ ఫండ్
గతంలో పిట్లం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఒక రిజిస్టర్ చిట్ ఫండ్ చిన్న చిన్న వ్యాపారస్తులను టార్గెట్ గా చేసుకొని 50,000 నుండి పది లక్షల వరకు చిట్టీలను నిర్వహించారు. 2000 మొదలుకొని పదివేల వరకు 40 నెలలు, 24 నెలలు ఇలా నెలల వారీగా చిట్టీలను నిర్వహించి చేతులు ఎత్తేసిన సంఘటన పిట్లంలో జరిగింది. ఇంత జరిగినా నష్టపోయిన చిట్టి సభ్యులు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు చేయకపోవడం గమనార్హం. ఈ రిజిస్టర్ చిట్ ఫండ్ నిర్వహించిన వారికి రాజకీయ నాయకుల పలుకుబడి ఉండడంతో కూడా ఇందులో ఉన్న సభ్యులు ఫిర్యాదు చేయడంలో వెనుకంజ వేసినట్లు విశ్వసనీయ సమాచారం.
. . . చెక్కులను విత్ డ్రా చేసుకుంటున్న వైనం
పిట్లం మండల కేంద్రంలో నిర్వహిస్తున్న చిట్టి వ్యాపారంలో నిర్వాహకులు ఏకంగా సభ్యులకు తెలవకుండానే వారి చెక్కుల నుండి డబ్బులను విత్ డ్రా చేసుకుంటున్నారు. చిట్టిని లిఫ్ట్ చేసిన సమయంలో పూచికత్తుగా తీసుకున్నటువంటి చెక్కులను చిట్టి అయిపోయినంక సైతం సభ్యులకు ఇవ్వకుండా వారికి తెలవకుండానే డబ్బులను విత్ డ్రా చేసుకుంటున్నారు. చిట్టి అయిపోయిన సమయంలో పూచికత్తుగా ఇచ్చిన చెక్కులను తిరిగి ఇవ్వమని అడిగినప్పటికీ వారు చెక్కులను ఇవ్వకుండా దాటవేస్తున్నారని మండలంలో విమర్శలు వినిపిస్తున్నాయి.
. . . అధికారులు దృష్టి సారించాలి
చిరు వ్యాపారం చేసుకుంటూ పూట గడుపుతున్న వ్యాపారస్తులు వారికి జరిగిన నష్టం పై అధికారులకు విన్నవించుకోలేక, ఎవరికి చెప్పాలో తెలియక చిట్టి నిర్వాహకుల కు ఉన్న నాయకుల అండకు భయపడి ఫిర్యాదు చేయటం లేదు. ఇటువంటి వాటిపై అధికారులు దృష్టి సారించి చర్యలు చేపట్టాలని ఆర్థిక మేధావులు అంటున్నారు.
