ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి పట్టణ పరిధిలోని నాలుగో వార్డు దేవునిపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. పైకప్పు నుండి పెచ్చులూడి పడటం, గోడల బలహీనత, బేస్మెంట్ కూలిపోతుండడం వంటి పరిస్థితుల నేపథ్యంలో గ్రామ ప్రజలు విద్యార్థుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 40 మంది విద్యార్థుల తల్లిదండ్రులు, భవనం ప్రమాదకరంగా ఉండటంతో పాఠశాలకు పంపేందుకు నిరాకరించగా, ఖర్చులు భరించలేని స్థితిలోనూ ప్రైవేట్ పాఠశాలలకే తమ పిల్లలను పంపాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలు మండల విద్యాధికారి (ఎంఈఓ) రాజులు ను కలిసి సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ పాఠశాల భవనం పూర్తిగా శిథిలంగా మారిందన్న విషయం ఇదివరకే మా దృష్టికి వచ్చిందనీ, తను స్వయంగా దేవునిపల్లి గ్రామానికి వెళ్లి ప్రాథమిక పాఠశాల భవనాన్ని పరిశీలించానన్నారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు తీసుకుంటాను. నూతన భవన నిర్మాణానికి సంబంధించి అధికారులకు నివేదిక అందిస్తాను అని ఆయన పేర్కొన్నారు. ఎంఈఓ రాజులు స్పందనతో గ్రామ ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయి. త్వరలో నూతన భవన నిర్మాణం ప్రారంభమైతే, తమ పిల్లలను మళ్లీ ఊరిలోనే ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తామని వారు తెలిపారు. గ్రామ ప్రజలు విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చిన ఎంఈఓ రాజుల కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నీల రవి, దుంపల సుధాకర్, నాగం దేవేందర్, నరేందర్, ప్రకాష్, శ్రీహరి, ప్రశాంత్, సందీప్, బైండ్ల హనుమంతు, ఎరుకల దశరథం, దుంపల ప్రశాంత్, రాజు, తదితరులు పాల్గొన్నారు.
