- అధికారుల ఆదేశాలను అమలు చేయడమే కారణమా?
- ఇందూర్ కల్లు రాజకీయాలకే ఎస్ హెచ్ వో బలి
- ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టుకు బదిలీ చేసినా ఎస్ హెచ్ వో నియామకమేది?
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో కల్తీకల్లు (కృత్రిమ) మాఫియాకు ఎస్ హెచ్ వో బలి అయ్యాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. నిజామాబాద్ జిల్లాలో కల్తీకల్లు తయారి కుటీర పరిశ్రమ నుంచి పరిశ్రమ స్థాయికి ఎదిగిన విషయం తెల్సిందే. రాష్ట్రంలో అత్యధికంగా డ్రగ్ బాధితుల జిల్లాగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు పేరుంది. ప్రధానంగా ఈత చెట్లు, తాటి చెట్ల నుంచి సేకరించే కల్లు స్థానంలో రసాయనాలు, నిషేదిత మత్తు పదార్థాలతో తయారయ్యే కల్తీకల్లు ఉమ్మడి జిల్లాను శాసిస్తున్నాయి. దానికి ఒకసామాజిక వర్గానికి అండగా పోలీసు, ఎక్సైజ్ అండదండలు ఉండగా దానికి రాజకీయం తోడవ్వడంతో కృత్రిమ కల్లు మాఫియా వ్యవహరంలో ఉమ్మడి జిల్లాలో ఇంత వరకు చాలా మంది పోలీసులు, ఎక్సైజ్ అధికారులు బలి అయ్యారు. తాజాగా నిజామాబాద్ ఎక్సైజ్ ఎస్ హెచ్ వో దిలీప్ ను గుట్టుచప్పుడు కాకుండా సాలూరా ఇంటిగ్రేటెడ్ ఎక్సైజ్ చెక్ పోస్టుకు బదిలీ చేయడం విశేషం.
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి ఎస్ హెచ్ వో గా ఉన్న దిలీప్ బదిలీ వ్యవహరం ఇప్పటికి ఎక్సైజ్ అధికారులు రహస్యంగానే ఉంచారు. దాదాపు 2 వారాల క్రితం దిలీప్ ను నిజామాబాద్ ఎక్సైజ్ ఎస్ హెచ్ వో నుంచి చెక్ పోస్టుకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఎస్ హెచ్ వోను నియమించకుండా ఎస్సైకి ఇంచార్జి బాధ్యతలు అప్పగించడం కలకలం రేపుతుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రెండు కల్లు డిపోల వ్యవహరమే ఎస్ హెచ్ వో బదిలీకి కారణమని తెలిసింది. నిజామాబాద్ నగరంలోని వర్ని రోడ్డులో గల మూడవ డిపోకు ఇటీవల అధికారులు రేషన్ (ఈత , తాటి చెట్లు) లేవనే కారణంతో కోటగల్లిలో గల మూడవ కల్లుబట్టిని మూసివేశారు. వారు ఇటీవల ఉన్నతాధికారులతో మాట్లాడి కల్లుబట్టిని తెరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా కమిషనరేట్ నుంచి అనుమతులు వస్తున్న విషయం తెలిసినా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కల్లుబట్టిని తెరిచేందుకు ఎస్ హెచ్ వో అనుమతించినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో మింగుడు పడని ప్రత్యర్థి డిపో వారు ఫిర్యాదు చేయడంతో ఎస్ హెచ్ వో దిలీప్ ను ఉన్నఫళంగా చెక్ పోస్టుకు బదిలీ చేశారని వినికిడి.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కల్తీకల్లు (కృత్రిమ) కల్లు ఫేమస్. మత్తు కోసం నిషేదితమైన డేంజర్ డ్రగ్ గా పేరు గాంచిన అల్ప్రాజోలంను వినియోగించి కల్లుతయారు చేస్తున్న డిపోలపై దాడులు జరుగవు. ఎందుకంటే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉన్న ఈత, తాటి చెట్ల ద్వారా వచ్చే కల్లు స్థానిక ప్రజల అవసరాలకే సరిపోదు. కానీ లైసెన్స్ డ్ గీత కార్మికులను పోగేసి ఏర్పాటు చేసే సొసైటీలో (కల్లుడిపోలలో) కృత్రిమ కల్లు తయారి విషయం నిజామాబాద్ జిల్లాలోని ఎక్సైజ్ కానిస్టేబుల్ మొదలుకుని ఎక్సైజ్ మంత్రి వరకు తెలుసు. కానీ ఎప్పుడు కూడా కల్లుడిపోలపై దాడులు జరుగవు. అల్ర్పాజోలం, డైజోఫాం, క్లోరోఫాం లాంటివి దొరకవు. దొరికినా చుట్టు ప్రక్కల ప్రాంతాలలో కనిపిస్తాయి. స్మగ్లర్లపై కేసులు నమోదు కావడం, జైలుకు వెళ్లడం సాధారణమే కానీ డిపోలు మూతపడడమనేది అసాధారణమైన విషయం. నిజామాబాద్ నగరంలో మూడవ కల్లు డిపోకు సంబంధించిన కల్లుబట్టిని తెరిచేందుకు ఎక్సైజ్ అధికారుల అత్యుత్సాహం ఎస్ హెచ్ వో మెడకు ఉరిగా మారింది. కల్లుడిపోలతో అనుబంధం ఉన్న రాజకీయ నాయకుల ఒత్తిడితో ఎస్ హెచ్ వో పై వేటు పడినట్లు చర్చ జరుగుతుంది.
