28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

నేడు కొత్త మంత్రివర్గ విస్తరణ

Must read

📰 Generate e-Paper Clip

  • ముగ్గురికే అవకాశమా..?
  • ఆరు పోస్టులను భర్తీ చేస్తారా..?
  • ఇద్దరు మంత్రులకు ఉద్వాసన తప్పదా..?
  • సామాజిక కూర్పు సాధ్యమేనా

 

నిజామాబాద్, బతుకమ్మ : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలల తర్వాత రెండవ విడత మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు శనివారం ఎఐసిసి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నాటరాజన్ తో చర్చించినప్పుడే మంత్రివర్గ విస్తరణ ఖాయమని పార్టీ వర్గాలు చెప్పకనే చెప్పాయి. అయితే శనివారం రాజ్ భవన్ నుంచి ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్దంగా ఉండాలని సమాచారం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఆదివారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాష్ట్రానికి వస్తుండడంతో మంత్రుల ప్రమాణ స్వీకారం ఖాయమని చర్చ మొదలయింది. రాష్ట్రమంత్రి వర్గ విస్తరణలో ముగ్గురికి అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండగా ఆరుపోస్టులు ఖాళీగా ఉన్నాయి. సామాజిక వర్గాల సమతుల్యత సాధ్యం కాకపోవడంతోనే మొదటి విడతగా ముగ్గురిచేత ప్రమాణస్వీకారం చేయిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజ గోపాల్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వెంకటస్వామి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, మైనార్టీ కోటా నుంచి ఎమ్మెల్సీ అమీర్ ఆలీ ఖాన్ ల పేర్లు వినిపించాయి. అయితే శనివారం ముగ్గురిని మాత్రమే ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారని తెలిసి కొందరు ఢిల్లీకి పయనమయ్యారు. కాంగ్రెస్ అగ్రనేతలను కలువడంతో పాటు ఎఐసిసి కార్యదర్శి కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్ లతో పాటు ఇతర అగ్రనేతలను కలిసి తమకు అవకాశం కల్పించాలని కోరినట్లు సమాచారం. అంతేగాకుండా ప్రస్తుతం ఇద్దరు మంత్రుల వ్యవహర శైలి బాగా లేదని వారిని తప్పిస్తారని ప్రచారం జరుగుతంది. అయితే వారిని తొలగిస్తారా లేక ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తారా అనే సస్పెన్షన్ కు తెర పడాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే.

రాష్ట్ర మంత్రి విస్తరణ ఆగడానికి సామాజిక వర్గాల న్యాయం చేయకపోవడమే ప్రధాన కారణం. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల కొరకు బీసీ జనాభా దామాషా ప్రకారం ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని కాంగ్రెస్ ఆనాడు ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రివర్గంలో ఇద్దరికి మాత్రమే బీసీలకు అవకాశం ఇవ్వడంతో ఆ వర్గంలో కొత్తగా ఎవరికి అవకాశం ఇస్తారనే చర్చ జరుగుతుంది. రెండవ విడత మంత్రివర్గ విస్తరణ ఆగిపోవడానికి ప్రధాన కారణం రెడ్డిలకు మంత్రి పదవులు ఎక్కువ దక్కాయని,  కాంగ్రెస్ క్యాబినెట్ లో ఈసారి మైనార్టీలకు ఎవ్వరికి అవకాశం లేకపోవడం విశేషం. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ఎమ్మెల్సీ అమీర్ ఆలీ ఖాన్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ ఆలీలు పదవులను ఆశిస్తున్నారు. ఎస్సీలలో మంత్రి పదవులు మాలమాదిగలకు దక్కినప్పటికీ రెండవ విడత మంత్రివర్గ విస్తరణలో మాదిగలు తమకు కచ్చితంగా పదవులు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా మాదిగలకు అవకాశం దక్కలేదు కాబట్టి మంత్రివర్గ విస్తరణలో స్థానం కల్పించాలని డిమాండ్ కోసం ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానంకు తమ సామాజిక వర్గం నుంచి ఒకరికి మంత్రి పదవి ఇప్పించాలని కోరారు. ప్రస్తుతం స్పీకర్ గా ఉన్న గడ్డం ప్రసాద్ కు మంత్రి వర్గంలో చోటు కల్పించి ఆయన స్థానంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి స్పీకర్ గా అవకాశం ఇస్తారనే చర్చ కూడా జరుగుతుంది. వెలమ సామాజిక వర్గం నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మధన్ మోహన్ రావులు పదవి కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు మంత్రి పదవిని ఆశిస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గంలో మంత్రివర్గంలో మొదటి నుంచి స్థానంను బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆశిస్తున్న విషయం తెల్సిందే. రెండవ విడత మంత్రివర్గ విస్తరణ ఆగిందే సుదర్శన్ రెడ్డి కోసమని ప్రచారం జరుగుతుంది. శనివారం సుదర్శన్ రెడ్డి ఢిల్లీ వెళ్లడంతో ఆయనకు మంత్రి పదవి ఖాయమని జిల్లాలో కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇటీవల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి మైనార్టీ కోటాలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా నియామకమైన షబ్బీర్ ఆలీ కూడా రెండవ విడత మంత్రివర్గ విస్తరణలో మైనార్టీ కోటాపై నమ్మకాన్ని పెట్టుకున్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కలకుంట్ల మధన్ మోహన్ తనకు మంత్రి పదవి కోసం ఎఐసిసి స్థాయిలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో తాను చేసిన సేవలకు తనకు ఉన్న పరిచయాలు, వెలమ సామాజిక వర్గం నుంచి తనకు ఈసారి మంత్రి పదవి దక్కడం ఖాయమనే నమ్మకంతో ఉన్నారు.

More articles

Latest article