. . . ఆగిన రోడ్డు నిర్మాణ పనులు
. . . రైతులకు తప్పని తిప్పలు
రుద్రూర్ బతుకమ్మ :
జిల్లాలోని పలు గ్రామాలల్లో రోడ్డు పనులు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల నత్తనడకన సాగుతున్నాయి. రుద్రూర్ మండలంలోని రాణంపల్లి గ్రామ శివారు నుండి పంట పొలాలకు వెళ్లే మెటల్ రోడ్డు నిర్మాణానికి రూ. 50 లక్షలతో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్థానిక మండల నాయకులతో కలిసి భూమి పూజ చేసి నాలుగు నెలలు గడుస్తున్నా ఇంకా ఇప్పటివరకు రోడ్డు నిర్మాణ పనులు కూడా ప్రారంభించలేదని రైతులు ఆరోపిస్తున్నారు. రోడ్డు నిర్మాణ పనులను ఇంకెప్పుడు పూర్తి చేస్తారని నెల క్రితం పలు పత్రికల్లో వార్తా కథనాలు రావడంతో మెటల్ రోడ్డుకు సంబంధించిన మెటీరియల్స్ తీసుకువచ్చి రోడ్డుపై వేసి కాంట్రాక్టర్ చేతులు దులుపుకున్నారు. ఆ మెటీరియల్స్ ను రోడ్డుకు అడ్డంగా వేయడంతో రైతులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెటీరియల్స్ ను రోడ్డుపై వేయడంతో 20 రోజుల్లో వరి పంటలు చేతికొస్తాయని, వరి కొత మిషిన్లు, లారీలు పొలం వద్దకు రావడానికి మరింత ఇబ్బంది ఎదురవుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. రోడ్డు నిర్మాణ పనుల పై కాంట్రాక్టర్ ఎందుకింత నిర్లక్ష్యంగా వహిస్తున్నారని అర్థం కాని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా కాంట్రాక్టర్ వెంటనే రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని రైతులు కోరారు.

