27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

నారాయణ సీబీఎస్ఈ కేశపూర్ బ్రాంచ్‌పై చర్యలు తీసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

డిచ్ పల్లి, బతుకమ్మ :

 

డిచ్ పల్లి మండలం కేశపూర్ గ్రామ శివారులో నారాయణ సీబీఎస్ఈ బ్రాంచ్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని యు ఎస్ ఎఫ్ ఐ, టీజీవీపీ, ఏఐఎఫ్‌డీఎస్ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా, నిర్మాణం పూర్తికాకముందే భవనంలో అక్రమంగా పాఠశాల నిర్వహిస్తూ భారీ ఫీజులతో అడ్మిషన్లు చేపడుతున్నారని ఆరోపిస్తూ సంఘాల ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. విద్యార్థి సంఘాల నాయకులు పెద్ది సూరి (యూఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి), బొబ్బిలి కళ్యాణ్ (టీజీవీపీ జిల్లా అధ్యక్షులు), మేత్రి రాజశేఖర్ (ఏఐఎఫ్‌డీఎస్ జిల్లా కార్యదర్శి) మాట్లాడుతూ, 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే అనుమతులు లేకుండా ఈ విద్యాసంస్థ కార్యకలాపాలు కొనసాగుతోందని ఆరోపించారు. ఈ విషయంపై విద్యాశాఖ అధికారులను ప్రశ్నించగా అనుమతులు లేవని చెప్పినా, చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని విమర్శించారు. డిచ్ పల్లి ఎంఈఓ వ్యవహారశైలిపై కూడా వారు అనుమానాలు వ్యక్తం చేస్తూ, యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విద్యను వ్యాపారంగా మార్చే కార్పొరేట్ విద్యాసంస్థలపై కఠిన చర్యలు అవసరమని వారు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఈ ఫిర్యాదును జిల్లా విద్యాశాఖాధికారి పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు నాయకులు తెలిపారు. వెంటనే భవనాన్ని సీజ్ చేసి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూఎస్‌ఎఫ్‌ఐ నగర కార్యదర్శి పి. మహేష్, నాయకులు మారుతి, జి. మహేష్, టీజీవీపీ జిల్లా ఉపాధ్యక్షులు సిద్దు, ఏఐఎఫ్‌డీఎస్ జిల్లా కమిటీ సభ్యుడు వినోద్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article