- బీబీపేట ఉన్నత పాఠశాలను సందర్శించిన కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
బతుకమ్మ, మాచారెడ్డి: పదవ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఉపాధ్యాయులకు సూచించారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ( తిమ్మయ్య గారి నారాయణరెడ్డి సుశీల స్కూల్) ను ఆయన శుక్రవారం సందర్శించారు. స్కూల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. కంప్యూటర్, సైన్స్ ల్యాబ్ లను పరిశీలించారు. టెన్త్ క్లాస్ విద్యార్థి విద్యార్థులకు పరీక్షల పై అవగాహన కల్పించారు . ప్రభుత్వ స్కూల్ అయినప్పటికీ అన్ని సౌకర్యాలు కల్పించడం అభినందనీయమన్నారు. మిడ్ డే మీల్స్ ఎలా ఉందని విద్యార్థులను అడిగి భోజనం ను పరిశీలించారు. పాఠశాల నిర్వహణ పై సంతృప్తిని వ్యక్తం పరిచారు. అనంతరం ఆయన గ్రామపంచాయతీ కి సంబంధించిన తాగు నీటి ఓపెన్ వెల్ ను పరిశీలించారు. రాబోయే సమ్మర్లో ఏ గ్రామానికి గాని నీటి ఎద్దడి కాకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఓపెన్ వెల్ కు జాలిమూత ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ హౌస్ పరిశీలించారు. త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బిల్డింగ్ నిర్మిస్తున్న కాంట్రాక్టర్ స్లాబ్ కొరకు ఇసుక కావాలని కలెక్టర్ ను కోరగా మాచారెడ్డి లో అందుబాటులో ఉందని ఇప్పిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
