. చిన్న బాస్ ను కలవాలని పీడీఎస్ మాఫియాకు హుకూం
. హడలెత్తిస్తున్నఏఎస్సై.. ముక్కున వేలేసుకుంటున్న శాఖ
. చర్చనీయాంశమవుతున్న ఆ ఇద్దరి వ్యవహారం
నిజామాబాద్ , బతుకమ్మ: పోలీసు బాస్ పేరు చెప్పి పీడీఎస్ మాఫియాను చిన్న బాస్ హడలెత్తిస్తున్నాడు. ఓ పోలీస్ స్టేషన్ ఏఎస్సై నేరుగా పీడీఎస్ వ్యాపారులకు ఫోన్ లు చేసి ‘పెద్ద బాస్ కలవమంటున్నారు..’ అనగానే గబరా పడుతున్న పీడీఎస్ వ్యాపారులు పరుగుపరుగునా పెద్దసార్ కార్యాలయానికి తరలివస్తున్నారు. నగరం కేంద్రంగా పీడీఎస్ దందా చేస్తున్న వారికి ఇటీవల ఫోన్ చేసిన ఏఎస్సై పెద్ద సార్ రమ్మంటున్నాడని చెప్పాడు. గబరాపడిపోయిన వారు కార్యాలయానికి రాగా, తీరా అక్కడ పెద్ద సార్ కాకుండా చిన్నసార్ అందుబాటులో ఉండటంతో సార్ ను కలిశారు. ‘దందా’ చేసుకోవాలంటే ఎంతో కొంత ఇవ్వాలని ఆ చిన్నసార్ హుకూం జారీ చేశాడు. కమ్మర్ పల్లిలో, ఆర్మూర్ లో రేషన్ దందా నిర్వహకులకు ఇదే రీతిన ఫోన్ రావడం వారు పరుగు పరుగున వచ్చి అమ్యామ్యాలను సమర్పించడం చకచకా జరిగిపోయింది. గత నెలలో గణేశ్ నిమజ్జనం సందర్భంగా బోధన్ లో బందోబస్తు కు వెళ్లిన చిన్నబాస్ అక్కడి పీడీఎస్ మాఫీయానూ వదల్లేదని తెలిసింది. అక్కడి పీడీఎస్ వ్యాపారులను నేరుగా తన వద్దకు పిలిపించుకొని సెటిల్ చేయడం విశేషం. పెద్ద సార్ కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేని పనులు ఏఎస్సై స్థాయి అధికారి ఫోన్ లో సెటిల్మెంట్ లు చేస్తుండడం ఆ శాఖలో చర్చనీయాంశమైంది.
అప్పటి నుంచి దోస్తులు..
గతంలో నిఘా విభాగంలో పని చేసిన ఏఎస్సై , చిన్న సార్ కు ఇల్లీగల్ దందాలకు సంబంధించిన సమాచారం మొత్తం అందజేసి, తానే కేంద్రంగా వసూళ్లకు తెరలేపినట్లు తెలిసింది. గతంలో సదరు ఏఎస్సై టాస్క్ ఫోర్స్ లో పని చేసి ఉన్న కారణంగా తమపై ఎక్కడ రైడ్ లు జరుగుతాయోనని పీడీఎస్ మాఫియా ఒకింత భయాందోళన గురవుతూ ఆయన చెప్పినట్లు వింటూ తమకు తోచినంత సర్దుబాటు చేస్తున్నట్లు తెలిసింది. నిజామాబాద్ జిల్లాలో వసూలు చేస్తే పోలీస్ స్టేషన్ లకు సంబంధించిన వారో లేదా టాస్క్ ఫోర్స్ వారు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు సర్వసాధారణం. కాని కొత్తగా పోలీస్ బాస్ పేరిట జరుగుతున్న వసూళ్ల వ్యవహారంతో ఆ పోలీస్ అధికారులే ముక్కున వేలేసుకుంటున్నారు. చిన్నబాస్ కు నిజామాబాద్ లో పని చేసిన అనుభవం ఉండటంతోపాటు ఏఎస్సై తాను ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో ఇల్లీగల్ దందాల నిర్వాహకుల నుంచి వసూళ్ల పర్వానికి తెరలేపినట్లు తెలిసింది. ఏకంగా పోలీస్ బాస్ కార్యాలయాన్ని అడ్డాగా చేసుకుని జరుగుతున్న దందా వ్యవహారం కమిషనరేట్ సరిహద్దుల్లో వినిపిస్తుంది.
సార్ కార్యాలయంలోనే కథలు..
పొలీస్ బాస్ ఎలాంటి ఇల్లిగల్ దందాలను ఉపేక్షించకుండా పేకాట, మట్కా, ఆన్ లైన్ బెట్టింగ్ మొదలుకొని అక్రమ ఇసుక, రేషన్ బియ్యం దందాలపై ఉక్కుపాధం మోపుతున్నారు. ప్రతి విభాగానికి టార్గెట్ లు ఇచ్చి మరీ క్రైం కంట్రోల్ చేస్తుంటే కమిషనరేట్ మీదుగానే జరుగుతున్న వసూళ్ల వ్యవహరం ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది. పోలీస్ బాస్ కే తెలియకుండా సార్ కార్యాలయం కేంద్రంగా జరుగుతున్న ఈ వ్యవహరంపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
