27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

జిల్లాలో నమోదవుతున్న ప్రతి కేసును నాణ్యమైన దర్యాప్తుతో చట్టపరమైన గడువులోపు పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో సీసీటీఎన్ఎస్ ద్వారా జిల్లాలో నమోదైన కేసుల పురోగతి, నేర నియంత్రణ చర్యలు, దర్యాప్తు పనితీరుపై నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు, సకాలంలో చార్జిషీట్లు దాఖలు చేసి నిందితులకు శిక్షలు పడేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సీసీటీఎన్ఎస్ 2.0 అమలులో భాగంగా నమోదయ్యే ప్రతి కేసుకు సంబంధించిన వివరాలను నిర్దేశిత గడువులోపు పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌లో నమోదు చేసి, ఎలాంటి పెండెన్సీ లేకుండా ఎప్పటికప్పుడు నవీకరించాలని ఎస్పీ పేర్కొన్నారు. జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాలు, మట్కా జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాత్రి వేళల్లో బస్సులు, అనుమానాస్పద వాహనాలు, కీలక ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి మాదకద్రవ్యాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పగలు, రాత్రి బీట్ వ్యవస్థను మరింత పటిష్టంగా అమలు చేయాలని, రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లపై తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అవకాశం లేకుండా చూడాలని ఎస్పీ ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వరదలు, భారీ వర్షాలు, ఇతర అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లాలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి సంబంధిత శాఖలతో కలిసి ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, అధిక వేగంతో వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, సోషల్ మీడియాలో శాంతిభద్రతలకు భంగం కలిగించే పోస్టులు, తప్పుడు ప్రచారాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్‌లో అందుబాటులో ఉన్న సిబ్బందికి అనుగుణంగా డ్యూటీ రోస్టర్‌ను రూపొందించి సమర్థవంతంగా అమలు చేయాలని, సిబ్బందిపై అధిక పనిభారం పడకుండా విధులను సమతుల్యంగా కేటాయించాలని ఎస్పీ ఆదేశించారు. డ్యూటీ రోస్టర్‌ను కచ్చితంగా అమలు చేయడం ద్వారా ప్రజలకు మరింత సమర్థవంతమైన, వేగవంతమైన పోలీసు సేవలు అందించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ కె. నరసింహారెడ్డి, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌హెచ్‌వోలు, ప్రత్యేక విభాగాల అధికారులు, జిల్లా పోలీసు కార్యాలయ అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

 

Measures must be taken to ensure speedy justice for the victims.

More articles

Latest article