. . . సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే ను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. బుధవారం మున్సిపల్ కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1886 సంవత్సరంలో అమెరికాలోని చికాగో నగరంలో కార్మిక వర్గం 8 గంటల పని కోసం సమావేశం నిర్వహించి నినదించారన్నారు. దాంతో అప్పటి ప్రభుత్వం పోలీసుల చేత కార్మిక వర్గం పైన దాడి చేయించి అనేక మంది ప్రాణాలను బలిగొన్నారని, అనేక మంది గాయాలపాలయ్యారని, వారి రక్తం నుండి ఏర్పడినదే ఎర్రజెండా అని తెలిపారు. నాటి నుండి నేటి వరకు ప్రపంచంలోని అన్ని దేశాలలో కష్టజీవులు కులాలు, మతాలు, ప్రాంతాలకతీతంగా తమ హక్కుల కోసం నినదించటానికి మేడేను ప్రతిజ్ఞ దినంగా నిర్వహించుకుంటున్నారని పేర్కొన్నారు. దాని స్ఫూర్తితో కార్మిక వర్గం అనేక పోరాటాలు నిర్వహించి ఎన్నో హక్కులను సాధించుకున్నారని, కానీ నేటి కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టజీవుల పైన భారాలను మోపి కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతున్నారని, అందువల్ల కష్టజీవులు తమ హక్కుల సాధన కోసం మేడేను పోరాట ప్రతిజ్ఞ దినోత్సవంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు.

