- మందు, విందు ఆట వద్దే
- పేకాటతో నాశనం అవుతున్న జీవితాలు
వర్ని, బతుకమ్మ : పచ్చని కాపురాను పేకాట మూడు ముక్కలు చేస్తోంది. వ్యసనానికి బానిసలైన వారు అన్నీ పోగొట్టుకుని రోడ్డున పడుతున్నారు. వర్ని మండలంలోని శంకోరా గ్రామ శివారులో గల గుట్ట ప్రాంతంలో పేకాట శిబిరాలు జోరుగా కొనసాగుతున్నాయి. పేకాట శిబిరాల నిర్వాహకులకు ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలు అన్నట్లు సాగుతుంది. వాట్సప్ గ్రూపు లు క్రియేట్ చేసి ఆ గ్రూపుల్లో పేకాట ఆడే ప్రదేశం, బెట్టింగ్‌కు పెట్టే సొమ్మును సదరు పేకాట రాయుళ్లకు తెలియజేస్తున్నారు.
– శివారు ప్రాంతాల్లో జోరుగా పేకాట..
పేకాటరాయుళ్లు, నిర్వాహకులు గ్రామస్తులకు కనబడకుండా గ్రామశివార్లను అడ్డాగా చేసుకుంటున్నారు. బాన్సువాడ డివిజన్ పరిధిలోని అటవీ, పొలాలు, గుట్టలు, వాగు గడ్డలు ఉన్న ప్రాంతాల్లో పేకాట ఆడుతున్నారు. పేకాట నిర్వాహకులకు అడ్డూ అదుపు లేకుండాపోతున్నదని గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.
మందు, విందు.. ఆటవద్దే…
పేకాట అంటేనే క్రేజీ గేమ్‌గా మారింది. ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు పేకాట కొనసాగుతున్నది. ఉదయం వేళల్లో పేకాట నిర్వాహకులు రెక్కీ నిర్వహించి ఏ ప్రాంతం అయితే ఆటకు ఇబ్బంది ఉండదో, ఏ ప్రాంతంలో ఆట పెడితే పేకాటరాయుళ్లు వస్తారో అక్కడ అడ్డాలు ఏర్పాటు చేస్తున్నారు. పేకాడే స్థలానికి కొద్ది దూరంలో నిర్వాహకులు ఇద్దరు నుంచి నలుగురు వ్యక్తులతో నిఘా ఉంచుతారు. పేకాటరాయుళ్లను మచ్చిక చేసుకునేలా మందు, చికెన్, మటన్‌తో విందు ఏర్పాట్లు చేస్తూ డబ్బులను దండుకుంటున్నారు. పేకాడుతుండగా డబ్బులు పోయిన వారికి ఫైనాన్షియర్లు అప్పులు ఇస్తున్నారని, రూ. 10 వేలు ఇస్తే తర్వాత రూ. 11 వేలు ఇవ్వాల్సి ఉంటుందని ఒప్పందం చేసుకుంటున్నారని తెలుస్తున్నది. పేకాట నిర్వహించే వ్యక్తులు ప్రతిరోజూ కేట్ తీయడంతో పాటు మందు, తిండి ఖర్చులు పోనూ సుమారు రూ. 20 వేల వరకు దండుకుంటున్నారని సమాచారం.
– పేకాటతో నాశనం అవుతున్న జీవితాలు…
పేకాట సరదాగా మొదలై.. ఆ తర్వాత బానిసై జేబులను గుల్లచేస్తున్నది. దింతో తమ జీవితాలను నాశనం చేసుకుంటూ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. యువత పేకాటకు మొదట ఆకర్షితులై వ్యసనంగా మారుతున్నారని, అధికారులు వెంటనే స్పందించి పేకాట స్థావరాలపై నిఘా పెట్టి పేకాట ఆడుతూ వారిపై తగు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
