- జడ్పీ చైర్మెన్ రేసుల నేతల ఇలాఖాలో తలకిందులైన రిజర్వేషన్లు
- జిల్లా పరిషత్ పీఠం ప్రకటనకై ఎదురు చూపులు
- వలసలకైనా రెడీ అవుతున్న లీడర్లు
- ద్వితీయ శ్రేణి నాయకులలో తీవ్ర నైరాష్యం
- రిజర్వు స్థానాలలో పోటీకి జంపింగ్ జిలానీలే దిక్కు
- కొత్త మండలాల్లో ఎక్కువ శాతం రిజర్వులకే కేటాయింపు
నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం స్థానిక సంస్ధల ఎన్నికల నగారకు సిద్ధమైంది. ఈ నెల 23నే స్థానిక సంస్థల ఎన్నికలకు తుది కసరత్తు చేసి రిజర్వేషన్ లను ఓకే చేసిన సీఎస్ ఆదేశాల మేరకు వాటిని బహిర్గత పరుచలేదు. ఈ నెల 26 తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏ క్షణమైన రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ముందుగా జడ్పీటిసీ, ఎంపీపీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ లు స్థానిక రాజకీయ పార్టీల నేతలతో సమావేశమై జడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్ లను ప్రకటించారు. నిజామాబాద్ జిల్లాలో 31జడ్పీటిసి స్థానాలకు గాను బిసీలకు 12, జనరల్ 10, ఎస్సీ 5, ఎస్టీలకు 3 స్థానాలను కేటాయించారు. మండల పరిషత్ స్థానాలను కూడా బిసీలకు 12, జనరల్ 10, ఎస్సీలకు 5, ఎస్టీలకు 3 స్థానాలను కేటాయించారు. కామారెడ్డి జిల్లాలో 25 జడ్పిటిసీ స్థానాలకు గాను బిసీలకు 11, జనరల్ 09, ఎస్సీ 3, ఎస్టీలకు 2 స్థానాలను కేటాయించారు. 25 మండల పరిషత్ స్థానాలను బిసీలకు 11, జనరల్ 8, ఎస్సీలకు 4, ఎస్టీలకు 2 స్థానాలను కేటాయించారు.

ఉమ్మడి జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్ లను ఖరారు చేసిన ఎన్నికల సంఘం జడ్పీ చైర్మెన్ ల స్థానంపై ప్రకటన జారీ చేయలేదు. దానితో నిజామాబాద్, కామారెడ్డి జడ్పి స్థానాలలో బీసీలకు, జనరల్ కు ఏస్థానం అనే చర్చ జరుగుతుంది. గత ఎన్నికలలో కామారెడ్డి బీసీ, నిజామాబాద్ జనరల్ కేటాయించిన విషయం తెలిసిందే. నిజామాబాద్ లో దాదన్నగారి విఠల్ రావు, కామారెడ్డిలో ధపేదార్ శోభలు బీఆర్ఎస్ తరుపున ఎన్నికై పూర్తి కాలం పనిచేశారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ లతో పాటు మహిళలకు సగానికి పైగా స్థానాలు కేటాయించడంతో ఆశావహులలో ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ బీసీకి, ఏస్థానం జనరల్ కేటాయిస్తారు అందులో మహిళకు ఎ జిల్లా అనే ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ద్వితీయ శ్రేణి నాయకులు జడ్పి, ఎంపిపి పదవులపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఆయా పాలకవర్గాల పదవి కాలం ముగిసి ఎడాదైన ఎన్నికలు నిర్వహించకపోవడంతో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు బీజేపీ, బీఆర్ఎస్ లోని చోటా మోటా లీడర్లలో నైరాశ్యం నెలకొంది. ఇదిలా ఉండగా కొత్తగా ఏర్పడిన మండలాల్లో సింహభాగం ఎస్ సీ లేదా ఎస్టీలకు కేటాయించడంతో అక్కడి నుంచి పోటీ చేయాలని ఆశపడ్డ ఆశావహుల్లో కొత్త రిజర్వేషన్ ల ప్రకటనతో నిరాశలో మునిగిపోయారు. ప్రస్తుతం ప్రకటించిన రిజర్వేషన్ లు రెండోదపా కూడా అమలు చేయాల్సి ఉండటంతో కొత్త మండలాల కొత్త లీడర్ల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది.
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు ఖరారు కావడంతో చైర్మెన్ కుర్చీపై ఆశలు పెట్టుకున్న లీడర్ల ఆశలు వమ్మాయ్యాయి. జడ్పీ చైర్మెన్ పోస్టు క్యాబినేట్ ర్యాంక్ హోదా తో పాటు లక్ష రూపాయాల వేతనం, కారు, కార్యాలయం ఉండటంతో చాలమంది నేతలు తమ లోకల్ ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్రపార్టీ అధినేతలను నమ్ముకున్నారు. ఈసారి జరిగే స్థానిక సంస్థల ఎన్నికలలో ఖాతా తెరుస్తామని ధీమాతో కమలనాథులు ఉన్నారు. శనివారం జడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్ లు ప్రకటించిన ఇంకా చైర్మెన్ స్థానాలను ఖరారు చేయకపోవడంతో షాక్ లో ఉన్న నేతలపై స్థానిక రిజర్వేషన్లు తమ ఆశలను గండికొట్టాయి. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో అధికార కాంగ్రెస్ తరుపున నగేష్ రెడ్డి (డిచ్ పల్లి), అరికేల నర్సారెడ్డి (మోపాల్), మానాల మోహన్ రెడ్డి(కమ్మర్ పల్లి), మార చంద్ర మోహన్ (ఆర్మూర్), గంగా శంకర్ (బోదన్) లు పోటీ పడుతుండగా ఆయా జడ్పిటీసీల రిజర్వేషన్ లు తలకిందులయ్యాయి. కామారెడ్డి జిల్లాలో బద్ధం ఇంద్రకరణ్ (బిక్కనూర్), రామారెడ్డి (పిట్లం), నాగనాథ్ పటేల్ (బిచ్కుంధ), రమేష్ కులకర్ణీ(జుక్కల్) పోటీలో ఉండగా అక్కడ వ్యతిరేకంగా రిజర్వేషన్ లు ఖరారు అయ్యాయి. బీజేపీ నుంచి నిజామాద్ జిల్లాలో మేడపాటి ప్రకాష్ రెడ్డి (బోదన్) నుంచి ముందు వరుసలో ఉండగా అక్కడ రిజర్వేషన్ లు తారు మారు అయ్యాయి. ఇంకా బీఆర్ఎస్ నుంచి కామారెడ్డి నుంచి మరోసారి ధపేధార్ ఫ్యామిలీ ఆశలు పెట్టుకుంది. నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ జడ్పీటీసీలు బాజీరెడ్డి జగన్, గడ్డం సుమన రెడ్డిల పేర్లు ప్రస్తావనకు వస్తున్న ఇంకా ఖరారు కాలేదు అని సమాచారం. ఇదిలా ఉండగా రిజర్వేషన్ లు ఖరారు కాకున్న జడ్పీ పీఠం కోసం వలస వెళ్లైనా పోటీ చేస్తామని చెబుతున్నారు నేతలు. ఇక కొత్త మండలాల్లో వ్యతిరేకంగా రిజర్వేషన్ లు వచ్చిన అక్కడ పార్టీ క్యాండేట్ లు దొరకని ఎడల ఇతర పార్టీల నేతలను ప్రధానంగా జంపింగ్ జిలానీలను బరిలో ఉంచే యోచనకు సిద్ధమౌతుండటం విశేషం.

