బోధన్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో లయన్స్ క్లబ్ ఆఫ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ జనరల్ హాస్పిటల్‌ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ శాసనసభ్యులు ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ ఆసుపత్రి ద్వారా బోధన్ పట్టణ ప్రజలకు, ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయి. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ చారిటబుల్ ట్రస్ట్ చేపడుతున్న ప్రజాసేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. అత్యంత తక్కువ ధరలతో నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం హర్షణీయమని పేర్కొన్నారు. బోధన్‌తో పాటు బాన్సువాడ తదితర ప్రాంతాల్లో లయన్స్ క్లబ్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు గర్వకారణమన్నారు. ఈ చారిటబుల్ ట్రస్ట్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలని ఆకాంక్షిస్తూ, ప్రభుత్వ పరంగా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండే ఆరోగ్య సేవలే సమాజ అభివృద్ధికి పునాది అని అన్నారు. భవిష్యత్తులో లయన్స్ క్లబ్ జనరల్ హాస్పిటల్‌ను మరిన్ని ప్రత్యేక వైద్య విభాగాలతో విస్తరించాలని ఆకాంక్షించారు. ఈ ఆసుపత్రిలో అత్యాధునిక సౌకర్యాలతో 20 పడకల ఐసీయూ (ICU) ఏర్పాటు చేయడం విశేషం. అత్యవసర వైద్య సేవలు అందించేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహెర్ బిన్ అంధన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, సబ్ కలెక్టర్ వికాస్ మహా, లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ డా. జి. బాబూరావు, డిస్ట్రిక్ట్ గవర్నర్ అమరనాథ్ రావు, లయన్స్ ట్రస్ట్ ఫౌండర్ పి. బసవేశ్వరా రావు, ట్రస్ట్ చైర్మన్ నరసింహారెడ్డి, మాజీ డైరెక్టర్ విజయలక్ష్మి, సభ్యులు నాగేశ్వర్ రావు, ఉమేష్ షిండే, కొడాలి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

