నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: బీసీ కులగణన కోసం వస్తున్న ఎన్యుమరేటర్లకు, అధికారులకు ప్రజలు సహకరించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ కోరారు. నగరంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ర్ట ప్రభుత్వం బీసీ కులగణనకు ముందడుగు వేయగా, కొంత మంది అగ్రవర్ణ నాయకులు ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని, అటువంటి వారిని రోడ్డుపై నిలదీస్తామని హెచ్చరించారు. బీసీ గణన చేస్తుంటే, కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నవారిని చరిత్ర క్షమించదని అన్నారు. మనమెంతో మనకు అంత రిజర్వేషన్లు దక్కాలన్నా, భవిష్యత్ తరాలకు న్యాయం జరగాలన్నా బీసీ కులగణన జరగాల్సిందేనని సుధాకర్ పేర్కొన్నారు. సమావేశంలో బుస్సా ఆంజనేయులు, కరిపె రవీందర్, దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, చంద్రకాంత్, గంగాధర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
