సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) మాస్ లైన్ నగర కార్యదర్శి ఎం.సుధాకర్
బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదామని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) మాస్ లైన్ నగర కార్యదర్శి ఎం.సుధాకర్ పిలుపునిచ్చారు. భూమి కోసం భుక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం, కార్మిక వర్గ హక్కుల కోసం, సామ్యవాద స్థాపన లక్ష్యంతో పోరాడి అసువులు బాసిన అమర వీరులకు సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో బుధవారం విప్లవ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) మాస్ లైన్ పార్టీ నగర కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు ఉద్యమం త్యాగాలతో పునీతమైందన్నారు. వీరోచిత తెలంగాణ సాయుధ పోరాటంలో, గోదావరి లోయ పోరాటంలో పీడిత ప్రజల విముక్తి కోసం ఎంతోమంది పోరాట యోధులు తమ ప్రాణాలను త్యాగం చేశారన్నారు. ముఖ్యంగా ప్రజాపంథా కోసం జీవితాలను త్యాగంచేసి పోరాడిన కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్, డివి కృష్ణ, పోట్ల రామనరసయ్య, నీలం రామచంద్రయ్య, రాయల చంద్రశేఖర్, దొరన్న, లింగన్న, ఎల్లన్న, సావలం సాయిలన్న, జార్జిరెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, వేములపల్లి కిరణ్ కుమార్ లాంటి వారు ఎందరో అమరులయ్యారన్నారు. వారి త్యాగాల స్ఫూర్తితో ప్రజలను వర్గ పోరాటాలలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. మన దేశం పెట్టుబడిదారు దేశంగా మారిందన్నారు. ప్రజా ఉద్యమాల మీద, ప్రజాస్వామిక హక్కుల మీద రాజ్యం దాడి చేస్తున్నదన్నారు. ప్రభుత్వాల నియంతృత్వ, ఫాసిస్టు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేసి, పోరాటాల వైపు పయనింప చేయాలన్నారు. అదే అమరవీరులకు నిజమైన నివాళి అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కే.రాజేశ్వర్, కిరణ్, గంగాధర్, లక్ష్మి, శివకుమార్, నాగరాజు, శంకరయ్య, నవీన్, సుశీల, గోవర్ధన్, ఆనంద్, ప్రవీణ్, ప్రశాంత్, శారద తదితరులు పాల్గొన్నారు.