నిజామాబాద్, బతుకమ్మ: ఉత్తర్ ప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ర్టాల్లో విద్యుత్ డిస్కమ్ ల ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తున్నామని విద్యుత్ ఉద్యోగులు అన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ పిలుపుమేరకు దేశ వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పవర్ హౌస్ లో జేఏసీ రాష్ట్ర నాయకుడు, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. గతంలో నోయిడా ఢిల్లీలో, బొంబాయిలో ప్రైవేటైజేషన్ చేయగా నష్టాలు రావడంతోపాటు వినియోగదారులకు సరైన సేవలు అందకపోవడంతో ప్రైవేటీకరణ నిలిచిపోయిందన్నారు. గతంలో కూడా ఉత్తరప్రదేశ్ లో ప్రైవేటీకరణకు ప్రయత్నించగా దేశ వ్యాప్తంగా నిరసనలు తెలుపడంతో నిలిపివేశారని, ఇప్పుడు మళ్లీ ప్రైవేటీకరణ ప్రయత్నాలు మొదలుపెట్టడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రైవేటీకరణ కారణంగా ఉద్యోగులతోపాటు ప్రజలు నష్టపోతారని అన్నారు. జేఏసీ కో కన్వీనర్ తోట రాజశేఖర్ మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు రాజేందర్ గౌడ్, పూదరి గంగాధర్, ఆర్ బాలేశ్ కుమార్, తోట రాజశేఖర్ , కాశీనాథ్, నాంపల్లి అశోక్, మల్లేశ్, జాకీర్ అలీ, చెన్నయ్య, ప్రసాద్ రెడ్డి , రాజేందర్ రెడ్డి, శ్రీనివాస్, రాజేందర్ ,శంకర్ గౌడ్ , సునీత, నిజాముద్దీన్, నగేశ్, సతీశ్, 200 మంది విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.