. ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ ను కోరిన బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి
బాల్కొండ, బతుకమ్మ: కాళేశ్వరం కృగిందని ఇంకెత కాలం బద్నాం చేస్తారని, బేషజాలకు పోకుండా రైతాంగానికి నీళ్లివ్వాలని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వచ్చిన మంత్రిని ప్రశాంత్ రెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ హయాంలో కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీకి నీటిని తీసుకొచ్చి పంటలకు అందించామన్నారు. కాళేశ్వరం కృగిందని ఇంకెంత కాలం ప్రచారం చేస్తారని, ఎక్కడో చిన్న డ్యామేజీ జరిగి ఉంటే మరమ్మతులు చేయించాలని సూచించారు. అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీలతోపాటు ఎల్ ఎండీ, ఎంఎండీ, రంగనాయక్ సాగర్, మల్లన్నసాగర్ , కొండ పోచమ్మ సాగర్ లను తాము నీటినితో నింపామని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అయిపోయిందని, ఇంకెంత కాలం తమను బద్నా చేస్తారని ప్రశ్నించారు. రైతాంగానికి నీరు అందించడంపై దృష్టి సారించాలని కోరారు.
