. . . రెండేళ్ల తర్వాత ఎన్నికలు
. . . సేవా నాస్తీ . . . విస్తరణ జాస్తి
. . . థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పెత్తనం కోసమే పోరు
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ రెడ్ క్రాస్ ఎన్నికలు ఎట్టకేలకు జరుగుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రెండు ప్యానళ్లు హోరాహోరీగా తలపడుతున్నయి. ఈ నెల 4న రెడ్ క్రాస్ కార్యవర్గ ఎన్నిక కోసం ఎలక్షన్ జరుగనుంది. సేవా తత్పరత కోసం అత్యవసర సమయంలో అవసరమైన రక్తాన్ని సేకరించి పేషెంట్లకు, బాధితులకు అందజేసే మహత్తర సంస్థగా పేరుగడించిన రెడ్ క్రాస్ సంస్థ నేడు రాజకీయ ప్రయోజనాలకు, నీడనిచ్చే కేంద్రంగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో నిజామాబాద్ రెడ్ క్రాస్ కు గొప్ప పేరుంది. ఎన్నోసార్లు అవార్డులు, రివార్డులతో పాటు గతంలోనే భవన నిర్మాణం జరిగి సేవలు విస్తరించాయి. అయితే గత కొంత కాలంగా రెడ్ క్రాస్ విస్తరణకు కొందరు మోకాళ్లడ్డారు. అక్కడ తిష్టవేసిన ఆ నలుగురు విస్తరణ సంగతి అటుంచి సేవా కార్యక్రమాల నాస్తీగా నిధుల జమను జాస్తిగా చేశారనే అపవాదును మూటగట్టుకున్నారు.

రెడ్ క్రాస్ అంటేనే ప్రపంచంలోనే పేరెన్నికగల సంస్థ. రెండవ ప్రపంచ యుద్దకాలంలో సైనికులు రక్తం కొరతతో మరణించడాన్ని చూసిన హెన్రీ డ్యూనాంట్ స్థాపించిన రెడ్ క్రాస్ ప్రపంచంలోనే పేరెన్నికకలిగిన సేవా సంస్థగా రూపుదిద్దుకుంది. దేశంలో రాష్ట్రపతి, రాష్ట్రంలో గవర్నర్, జిల్లాలో కలెక్టర్ల పర్యవేక్షణలో రెడ్ క్రాస్ నడుస్తుందంటే ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో చెప్పకనే చెబుతుంది. రెడ్ క్రాస్ ద్వారా కేవలం రక్తాన్ని సేకరించడమే కాకుండా తలసేమియ బాధితుల కోసం వార్డుల నిర్వాహణ, వృద్దుల కోసం ప్రత్యేక సేవా కార్యక్రమాలతో పాటు డయాలసిస్ కేంద్ర నిర్వాహణ, జనరిక్ మెడిసిన్, ప్రత్యేక అంబులెన్స్ ద్వారా సత్వర సేకరించిన రక్తాన్ని సపరేషన్ (ప్లేట్ లెట్లు)ను వేరు చేసే కార్యక్రమాలను ముందుకువచ్చింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన రెడ్ క్రాస్ భవనం ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిర్మించారు. కానీ సేవా రంగమే గాడితప్పినట్లయింది.

నిజామాబాద్ జిల్లాలో ఆ నలుగురు కీలక పదవుల్లో పెత్తనం చేస్తున్నారు. ప్రధానంగా సభ్యత్వం అనేది విస్తరణ అంతగా చొరవ చూపలేదనేది వాస్తవంగా మారింది. 1996, 2001, 2011, 2016 సంవత్సరాలలో జిల్లా కలెక్టర్లే చొరవ తీసుకుని సభ్యత్వం చేయించనవే ఎక్కువ అని చెప్పాలి. నిజామాబాద్ జిల్లా జనాభా 16 లక్షలు ఉండగా రెడ్ క్రాస్ సభ్యత్వం మాత్రం 10 వేలు దాటలేదంటే అతిశయోక్తి కాదు. గత కలెక్టర్ల హయంలో 6 వేల వరకు ఉన్న సభ్యత్వాన్ని కేవలం 2800 వరకు మాత్రమే పెంచడం గమనార్హం. రెడ్ క్రాస్ అనుబంధంగా ఉండే జూనియర్ రెడ్ క్రాస్ తో పాటు ఇతర సేవా కార్యక్రమాలను పెంచిన పరిస్థితి లేదు. నిజామాబాద్ రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రంలోనూ రక్తం కొరత అనే మాట ప్రస్తుతం వినబడుతుంది. ప్రధానంగా ఎఫిడమిక్ సమయంలో అత్యవసరమైన వైద్యం కోసం రెడ్ క్రాస్ కు వచ్చిన ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ లకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నాలుగు ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ లు ఏర్పాటయ్యాయంటే అంతా రెడ్ క్రాస్ చలవే అని చెప్పాలి. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలను పెంచేందుకు నిర్వహిస్తున్న అవగాహన అంతంత మాత్రమే. ఒకప్పుడు యువజన సంఘాలు, హిరోల అసోసియేషన్లు, వివిధ యూనియన్లు, వారి వార్షికోత్సవాలు, జన్మదిన వేడుకలకు భారీగా రక్తదానం చేసేవారు. వారిని మోటివ్ చేసి రక్తదాన శిబిరాలు నిర్వహించాలంటే కూడా రెడ్ క్రాస్ అంతంత మాత్రమే అని చెప్పాలి.

నిజామాబాద్ రెడ్ క్రాస్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే వారు శథవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. ఏదో ఒక పదవి ఉంటే కానీ పొద్దు గడవని కొందరు రెడ్ క్రాస్ లో పాగావేసేందుకు యత్నాలు ముమ్మరం చేశారు. ఎందుకంటే రెడ్ క్రాస్ సేవా సంస్థ అయినప్పటికీ దానిని తమ స్వార్థ ప్రయోజనాల కొరకు నాయకుల వద్ద తాకట్టుపెట్టేందుకు కులాల కుంపటి, రాజకీయ రంగును పులిమేశారు. నిజామాబాద్ రెడ్ క్రాస్ సొసైటీలో గతంలో పని చేసిన వారు ఇప్పటికి లెక్కలు చెప్పలేదనే ఆరోపణలు లేకపోలేదు. గతంలో సభ్యత్వం కలిగిన ఓ రైస్ మిల్లర్ చేయించిన వందకు పైగా సభ్యత్వాలు కనిపించకుండాపోయాయట. సభ్యత్వం పెరిగితే తమకు ప్రయోజనం ఉండదని గెలుపు సాధ్యం కాదని, సభ్యత్వ నమోదు విషయాన్ని దాచిపెట్టారనే ప్రధాన ఆరోపణలున్నాయి. సేవా రంగంలో యువతకు, విద్యార్థులను భాగస్వామ్యులను చేయాల్సిన చోట కొందరి ప్రయోజనాల కొరకే సభ్యత్వం చేయకపోవడం, నిధుల సేకరణ లేదనే వాదనలున్నాయి. గొప్పగా రెడ్ క్రాస్ లో సేవల కోసం ప్రారంభమైన కొన్ని విభాగాలు అప్పుడే మూతపడడం కూడా కొందరి కృషి కారణమని చెప్పవచ్చు. కానీ ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ కుర్చీ కావాలంటూ రాజకీయ ఎత్తుగడలు వేస్తుండడం విశేషం.
