
. ఆరు నెలలుగా డైట్ బిల్లుల చెల్లింపులు నిలిపివేత
. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు లేవు
. ఆగస్టు నెలకు సంబంధించి హాస్టల్ వార్డెన్ లకు అందని జీతాలు
‘‘అంకిత భావంతో పని చేయండి. ఆకస్మిక తనిఖీలు చేస్తాం.. ఏదైనా తేడా ఉంటే చర్యలు తప్పవు’’ ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల నిర్వహణపై నిర్వహించిన సమీక్షలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. సంక్షేమశాఖ అధికారులు, హాస్టళ్ల వార్డెన్లపై ఒక దశలో తీవ్ర ఒత్తిడి చేసే వ్యాఖ్యలివి. ఇదిలా ఉండగా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని, తమ ఆవేదనను ఎవరికి చెప్పుకోవాలని వార్డెన్లు తమలో తామే గొణుగుకుంటున్నారు. ఆరు నెలలుగా డైట్ బిల్లులు లేక, ఈనెల 20వ తేదీ వచ్చినా గతనెలకు సంబంధించిన వేతనాలు లేక తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఎవరికి చెప్పుకోవాలని తమకు తామే ప్రశ్నించుకుంటున్నారు.
నిజామాబాద్, బతుకమ్మ: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతిగృహలు సమస్యలకు కేంద్రాలుగా మారాయి. దశాబ్దాల క్రితం నిర్మించిన పురాతన హస్టళ్ల భవనాలు ఎప్పుడు కూలిపోతాయో తెలియక విద్యార్ధులు, అందులో పని చేసే సిబ్బంది భిక్కుభిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లకు ఆరు నెలలుగా డైట్ బిల్లులు చెల్లించడం లేదు. వసతిగృహాల నిర్వహణకు బడ్జెట్ లేకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు పరిస్థితి ఉంది. టాయిలెట్లు, బాత్ రూములు కంపుకొడుతున్నాయి. మార్చి నుంచి డైట్ బడ్జెట్ విడుదలకాక పోవడంతో వార్డెన్లు చేతులెత్తేసే పరిస్థితి ఉంది. బుధవారం నిర్వహించిన సమీక్షాసమావేశంలో కొందరు వార్డెన్లు తాము ఎదుర్కొంటున్న సమస్యలను లేవనెత్తారు. దీంతో ప్రభుత్వం నిధుల కొరత ఎదుర్కొంటోందని సమీక్షాసమావేశం నిర్వహించిన వారే తేల్చిచెప్పడం విశేషం.
నిజామాబాద్ జిల్లాలో 42 ఎస్సీ,33 బీసీ, 8 ఎస్టీ హస్టళ్లు ఉన్నాయి. ఎస్సీ వసతిగృహాల్లో 3,556, బీసీ హాస్టళ్లలో 2,800, ఎస్టీ హాస్టళ్లలో 1,480 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో ప్రీ మెట్రిక్(3 నుంచి 7వ తరగతి) విద్యార్ధులకు ప్రతి నెలా ఒక్కొక్కరికి రూ.950, 8నుంచి 10వ తరగతి విద్యార్ధులకు రూ.1050 చొప్పున, కళాశాలల విద్యార్థులకు రూ.1500 చొప్పున ప్రతినెలా డైట్ బడ్జెట్ విడుదల చేయాల్సి ఉంది. వాటి ద్వారనే విద్యార్ధులకు టిఫిన్, లంచ్, రాత్రి భోజనం అంద జేయాలి. పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు సాయంత్రం అదనంగా స్నాక్స్ అందిస్తారు. గత మార్చి నెలలో చివరి సారిగి బడ్జెట్ విడుదల కాగా, ఆ తరువాత నిధుల కొరతతో ఇప్పటి వరకు రూపాయి విడుదల కాలేదు. హాస్టళ్ల వార్డెన్లు అప్పులు చేస్తూ హాస్టళ్లను నిర్వహిస్తూ నెట్టుకొస్తున్నారు. కొందరు మహిళా వార్డెన్లు తమ బంగారాన్ని బ్యాంకుల్లో, ప్రైవేట్ ఫైనాన్స్ లలో కుదువ పెట్టి డబ్బులు తీసుకువచ్చి విద్యార్థులకు తిండిపెట్టే పరిస్థితి ఉంది. అప్పు ఇచ్చిన వారు తిరిగి చెల్లించాలని అడుగుతుండడంతో వార్డెన్లకు ఆర్థిక కష్టాలు తప్పడం లేదు. దీంతో వార్డెన్లు డైట్ చార్జీల చెల్లింపు వద్దని కేవలం డీపీసీ ద్వారా సరుకులు కొనుగోలు చేసి ఇవ్వాలని కోరుతున్నారు.
ఔట్ సోర్సింగ్ సిబ్బంది బాధలు..
జిల్లాలోని హస్టళ్లలో రెగ్యులర్ సిబ్బంది లేరు. ఉన్నది ఔట్ సోర్సింగ్ సిబ్బందే.. ప్రతి హాస్టల్ కు కామాటి, కుక్, వాచ్ మెన్ ఉండాలి. ఇప్పటికీ రెగ్యులర్ సిబ్బంది 20 మంది కుడా లేకపోవడం గమనార్హ . ఉన్న తాత్కాలిక సిబ్బందికి ఆరు నెలలుగా వేతనాలు లేవు. దీంతో హాస్టళ్లలో పని చేస్తున్న సిబ్బందిని ఆర్థిక కష్టాలు వేధిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలకు చెందిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు ఆగస్టు నెలకు సంబంధించిన వేతనాలు ఈనెల 20వ తేదీ వచ్చినా అందలేదు. ఇటీవల సంబంధిత శాఖలలో బదిలీలు, రిలీవ్ ల తరువాత సంబంధిత శాఖల అధికారులు గత నెల 23 న ట్రెజరీకి వేతనాల కోసం పంపిన అక్కడ నుంచి టోకెన్ రాకపోవడంతో వేతనాలు అందలేదు. డైట్ బడ్జెట్ అందక సతమతమవుతుంటే తాజాగా ట్రెజరీ అధికారుల తప్పిదంతో వార్డెన్ లు జీతాలు రాక ఆర్థిక కష్టాలు అన్ని ఇన్నీ కావు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్ల విద్యార్ధులకు డైట్ బిల్లలు, సిబ్బందికి వేతనాలు, నెల రోజులుగా ఎస్సీ, ఎస్టీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
