25 C
Hyderabad

సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని సీఎంకు కేటీఆర్ విజ్ఞప్తి

KTR appeals to CM to resolve issues faced by JNTU Sircilla students.

Must read

📰 Generate e-Paper Clip

 

. . .రూ.402 కోట్లతో మంజూరైన శాశ్వత క్యాంపస్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలి

 

. . .  కొత్త క్యాంపస్ పూర్తయ్యే వరకు ప్రస్తుత ప్రాంగణంలోనే కళాశాల కొనసాగించాలి

 

సిరిసిల్లా, బతుకమ్మ : 

 

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కళాశాల శాశ్వత క్యాంపస్ నిర్మాణంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించి, విద్యార్థుల విద్యాభ్యాసానికి ఎలాంటి ఆటంకం కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. 2021లో రూ.402 కోట్ల పరిపాలనా అనుమతులతో మంజూరైన జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల శాశ్వత క్యాంపస్ నిర్మాణం ఇప్పటికీ పెండింగ్‌లో ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. మండేపల్లి గ్రామంలో 20 ఎకరాల భూమిని కేటాయించినప్పటికీ, నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడంతో కళాశాల ప్రస్తుతం అగ్రహారంలోని డిగ్రీ కళాశాల ప్రాంగణంలో తాత్కాలికంగా కొనసాగుతోందని తెలిపారు. కళాశాలను ప్రస్తుత ప్రాంగణం నుంచి మరో ప్రైవేటు భవనానికి తరలించే ప్రతిపాదనలు విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందికి ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న తరగతి గదులు, ప్రయోగశాలలు, ఇతర మౌలిక సదుపాయాలు నిరుపయోగం కాకుండా చూడాలని సూచించారు. ఈ నేపథ్యంలో మండేపల్లిలో కేటాయించిన స్థలంలో శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసి పనులను వేగవంతం చేయాలని, కొత్త క్యాంపస్ పూర్తయ్యే వరకు కళాశాలను ప్రస్తుత ప్రాంగణంలోనే కొనసాగించేందుకు అనుమతించాలని కేటీఆర్ కోరారు. తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు కళాశాల ప్రస్తుత ప్రాంగణాన్ని ఖాళీ చేయాలంటూ నోటీసులు జారీ చేయకుండా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య అందించడంలో ఈ కళాశాల కీలకమని కేటీఆర్ పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు.

More articles

Latest article