నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి.సాయి చైతన్య ఆదేశానుసారంగా నిజామాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో నిజామాబాద్ అదనపు డీ.సీ.పీ (అడ్మిన్) బస్వారెడ్డి ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి 110వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొండ లక్ష్మణ్ బాపూజీ ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అదనపు డి.సి.పి(అడ్మిన్ ) మాట్లాడుతూ సకలజనుల, సబ్బండ వర్గాల ప్రజల సంతోషంగా ఉండాలని, జీవితాంతం పోరాడిన వ్యక్తి అని తెలిపారు. సాయుధ పోరాట కాలంలో పెత్తందారులను ఎదిరించిన వారికి న్యాయవాదిగా సేవలందించి, వారి తరపున న్యాయపోరాటం చేసిన ప్రజాస్వామిక వాది అని, గాంధీజీ స్ఫూర్తితో, దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని, తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటాల్లో అన్ని దశల్లోనూ స్ఫూర్తిని నీలిపారని, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం, సహకార రంగాల పటిష్టత కోసం, జీవిత మంతా కృషి చేశారని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ బంగారు తెలంగాణ కోసం శ్రమించాలని, భవిష్యత్తు తరాల కోసం అనునిత్యం ప్రతి ఒక్కరు కష్టపడాలని, భావితరాల కోసం బంగారు బాట వేయ్యాలని పోలీస్ శాఖ సిబ్బందికి అదనపు డీ.సీ.పీ (అడ్మిన్) పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ కార్యాలయ పరిపాలన అధికారి (ఏ.వో) ఆసియా బేగం, ఆఫీస్ సూపరింటెండెంట్ శంకర్, బషీర్, వనజా రాణి, రిజర్వు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, తిరుపతి, పోలీస్ కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ వీరయ్య, పోలీస్ కార్యాలయం సిబ్బంది, సి.సి.ఆర్.బి సిబ్బంది, సి.ఎస్బి సిబ్బంది, ఐటి కోర్ సిబ్బంది, పోలీస్ కంట్రోల్ రూమ్ సిబ్బంది, సెంట్రల్ కంప్లైంట్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.
