30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లతో విరివిగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

Must read

📰 Generate e-Paper Clip

  •  రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ
  •  కలెక్టర్ తో కలిసి ఏటీసీ సెంటర్లకు ప్రారంభోత్సవాలు

 

నిజామాబాద్, బతుకమ్మ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నెలకొల్పిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో నైపుణ్యంతో కూడిన శిక్షణ పొందడం ద్వారా యువతకు విరివిగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అందుబాటులోకి తెచ్చిన 65 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను శనివారం హైదరాబాద్ లోని మల్లెపల్లి ఏ.టీ.సీ సెంటర్ నుండి మంత్రులు జి.వివేక్ వెంకటస్వామి, డి.శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ విధానం ద్వారా లాంచనంగా ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో భాగంగానే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీనగర్ లో గల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐ.టీ.ఐ) ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన రెండు ఏ.టీ.సీ కేంద్రాలను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డితో కలిసి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రారంభించారు.

Extensive job and employment opportunities with advanced technology centers

ఏ.టీ.సీ కేంద్రాలలో వివిధ కోర్సులలో శిక్షణ అందించేందుకు వీలుగా నెలకొల్పిన ఆధునిక యంత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ, ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా, సరికొత్త సాంకేతికత అంశాలతో యువతలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఏ.టీ.సీ కేంద్రాలను ఏర్పాటు చేసిందని అన్నారు. అదే సమయంలో పారిశ్రామిక అవసరాలకు నైపుణ్యం కలిగిన అభ్యర్థులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లాలోని బోధన్, కమ్మర్పల్లి, భీంగల్, నిజామాబాద్ లలో ఐదు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. ఒక్కో ఏ.టీ.సీ సెంటర్ కు రూ. 4.70 కోట్ల నిధులను ఖర్చు చేశారని వివరించారు. మొదటి ఏడాది ఆరు కోర్సులలో శిక్షణ అందించడం జరుగుతోందని, క్రమక్రమంగా మార్కెట్ డిమాండ్ ఉన్న మరిన్ని ఆధునిక కోర్సులలో శిక్షణ అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని అన్నారు. టాటా కన్సల్టెన్సీ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుని ఏ.టీ.సీ కేంద్రాలలో శిక్షణ ఇప్పిస్తోందని, దీని వల్ల విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ప్లేస్ మెంట్ గ్యారంటీ ఉందన్నారు. అంతేకాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో, మల్టీ నేషనల్ కంపెనీలలో ఆకర్షణీయ వేతనాలపై కొలువులు పొందేందుకు ఆస్కారం ఉంటుందని, స్వయం ఉపాధికి కూడా ఆ కోర్సులు ఊతమందిస్తాయని షబ్బీర్ అలీ అన్నారు. ఈ అవకాశాన్ని యువతీ, యువకులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఏ.టీ.సీ కేంద్రాల ప్రిన్సిపాల్స్, ఇన్ స్ట్రక్టర్లు, శిక్షణ పొందుతున్న అభ్యర్థులు పాల్గొన్నారు.

Extensive job and employment opportunities with advanced technology centers

More articles

Latest article