జిల్లా జడ్జి సునీత కుంచాల
బతుకమ్మ నిజామాబాద్ సిటీ : ప్రతి వ్యక్తి తమను తాము పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా తాము ఉంటున్న పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం కూడా తమ వంతు బాధ్యతేనని జిల్లా జడ్జి సునీత కుంచాల పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛతభారత్ దివస్ కార్యక్రమాన్నినిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆమె హాజరై కోర్టు పరిసరాలను తోటి న్యాయమూర్తులు కోర్టు సిబ్బందితో కలిసి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిసరాలను ప్రతి ఒక్కరు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అప్పుడే ఆరోగ్యకరమైన సమాజాన్ని తీర్చిదిద్దుకోగలుగుతామని అని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వల్లే వైరల్ ఫీవర్ వల్ల భయంకరమైన వ్యాధులు ప్రభలుతున్నాయని వీటన్నింటినీ అరికట్టాలంటే ఎప్పటికప్పుడు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడాసంరక్షించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సివిల్ జడ్జి పద్మావతి, బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్, న్యాయవాదులురాజ్ కుమార్ సుబేదార్, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

