30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

కవిత బీసీల గురించి మాట్లాడడం హాస్యాస్పదం

Must read

📰 Generate e-Paper Clip

  •  కాంగ్రెస్ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు రాజా నరేందర్ గౌడ్

నిజామాబాద్ సిటి, బతుకమ్మ :  కాంగ్రెస్ పార్టీ బీసీలను విస్మరిస్తుందని కవిత మాట్లాడడం హాస్యాస్పదమని కాంగ్రెస్ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు రాజా నరేందర్ గౌడ్ అన్నారు. గురువారం నిజమాబాద్ జిల్లా కేంద్రం లోని కాంగ్రెస్ భవన్ లో ఎర్పాటు చేసిన  మీడియా  సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలను వంచించిన పార్టీ బి.ఆర్.ఎస్ గా మార్చుకున్న టీఆర్ఎస్  పార్టీ అని అన్నారు. పదేళ్ల పాలనలో రాజకీయంగా ఆర్థికంగా  రాష్ట్రంలో బీసీలు వెనుకబడి పోయారని, కేవలం కొంతమందికి బర్లు, గొర్రెలు, చేప పిల్లల పంపిణీ చేసి బీసీలను ఉద్ధరించామని ప్రగల్బాలు పలికారని తెలిపారు.  గొర్రెల పంపిణీ,  చేప పిల్లల పంపిణీలలో కూడా విపరీతమైన అవినీతికి పాల్పడిన నీచ చరిత్ర బిఆర్ఎస్ నాయకులదని అన్నారు.  బీసీ బందు ప్రకటిస్తామని చెప్పి బీసీలను మోసం చేసిన ఘనత  చరిత్ర బి ఆర్ ఎస్ పార్టీదని అన్నారు. తమరి పాలనలో వివిధ బీసీ కార్పొరేషన్ల ద్వారా ఎంతమందికి కార్పొరేషన్ రుణాలు మంజూరు చేశారో కవిత సమాధానం చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం కాలంలోనే బీసీల అభ్యున్నతి కోసం ప్రణాళికలు రచిస్తుందని, మంత్రివర్గంలో బీసీలకు పెద్దపీట వేయడంతో పాటు పార్టీ సంస్థాగత పదవులు బీసీలకు కట్టబెట్టిందని తెలిపారు. తమరి పార్టీలో మాత్రం కేవలం తమరి కుటుంబానికి తమరి వర్గానికి చెందిన వారికి మాత్రమే పార్టీ పదవులు దక్కాయని  ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే దళిత బహుజనల పార్టీ అని, దళిత బహుజనుల అభివృద్ధికి ఎల్లప్పుడూ లబ్దిచేసే విధంగా  కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని అన్నారు.  మీలాగా తప్పుడు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత బీసీలను దళితులను విస్మరించే తత్వం కాంగ్రెస్ పార్టీది కాదని ఆయన అన్నారు.  దేశంలోనే మొట్టమొదటిసారిగా కులగణన చేసి బీసీల లెక్కలు బయటపెట్టి తద్వారా బీసీలకు రాజకీయ ఆర్థిక స్వావలంబన కల్పించడమే ధ్యేయంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేసిందని తెలిపారు.  బిఆర్ఎస్ పార్టీ మాత్రం సమగ్ర సర్వే నిర్వహించి బీసీల లెక్కలు బయట పెట్టలేదని ఆయన విమర్శించారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కులగణన ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కేటాయిస్తుందని అన్నారు. కుల గణన ఆధారంగా బీసీలకు బడ్జెట్లో నిధులను కేటాయిస్తుందని ఆయన అన్నారు.  త్వరలోనే రాష్ట్రంలో అన్ని వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నారని వివిధ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయడమే కాకుండా బీసీ విద్యార్థులకు నూతన సంక్షేమ హాస్టళ్ళ  నిర్మాణం,  తమరి ప్రభుత్వంలో పేరుకుపోయిన పెండింగ్ స్కాలర్షిప్లను సకాలంలో విడుదల చేసే  యోచన లో ప్రభుత్వం ఉందని అన్నారు. అనవసరంగా కవిత  బీసీలపై కపట ప్రేమ నటించొద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నగర యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు తుటికూరి ప్రీతం, దిగంబర్ తదితరులు  పాల్గొన్నారు.

More articles

Latest article