- లాలి పరమానంద రాజా గోవిందా
- అంగరంగ వైభవంగా నరసింహుని డోలాసేవ
భీమ్ గల్, బతుకమ్మ : దక్షిణ బద్రిగా పేరొందిన పుణ్యక్షేత్రం అయిన నింబాచల క్షేత్రం(లింబాద్రిగుట్ట) పై జరుగుతున్న శ్రీ వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజైన ఆదివారం కమల పుష్కరిణి మండపంపై స్వామి వారికి డోల సేవను నంబి అర్చకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం ఉత్సవ ప్రారంభంలో ఆహ్వానీతులైన సకల దేవతలకు ఉద్వాసన పలికారు. ధ్వజ అవరోహణము చేసి ఉద్వాసన బలిని గావించారు.అనంతరం కమల పుష్కరిణిపై గల మండపానికి శ్రీ లక్మీ నృసింహుల ఉత్సవ మూర్తులను పల్లకిలో తీసుకువచ్చి సమస్త భక్తజనం భక్తి శ్రద్దలతో వీక్షిస్తుండగా అర్చకులు ప్రత్యేక పూజలను స్వామి వారికి నిర్వహించారు. పిమ్మట జో అచ్చితానంద… జోజో ముఖుందా…లాలీ పరమానంద రాజా గోవిందా అంటూ గోవిందునికి లాలి పాటలు పాడుతూ డోలసేవ నిర్వహించారు. స్వామి వారి పాటను వింటూ భక్తులు కండ్లు మూసుకొని తన్మాయులయ్యారు.ఈ కార్యక్రమం తో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిసాయి. పదకొండు రోజుల స్వామి బ్రహ్మోత్సవాలు నిర్విగ్నంగా పూర్తి అయ్యాయి.

గ్రామాలయానికి ఉత్సవ విగ్రహాలు..
సాయంత్రం శ్రీ లక్మీ నృసింహుని ఉత్సవ విగ్రహాలు శ్రీ వారి కొండ నుండి భీంగల్ చేరుకున్నాయి. గుర్రపు సేవపై స్వామిని అలంకరించి ఎంతో ఘనమైన డప్పులు, భాజ భజంత్రిలతో శ్రీ లక్మీ నృసింహుని ఉత్సవమూర్తులు గ్రామాలయమునకు ఊరేగింపుగా గ్రామాలయానికి తీసుకువచ్చారు. ఉత్సవమూర్తులు చేరుకున్న పిమ్మట సప్తావరుణ పూజ నిర్వహించారు. పూజ ముగిసిన పిమ్మట దివ్యమైన మహోత్సవ క్రతువును భగవంతుడైన శ్రీ లక్మీ నృసింహునికి జలాక్షతలతో సమర్పించారు. ఈ కార్యక్రమం తో ఉత్సవాలు సమాప్తం అయ్యాయి.సర్వే జనః సుఖినోభవంతుః, లోక సమస్త సుఖినోభవంతుః.

