చక్కెర ఫ్యాక్టరీలు తెరవకపోతే రైతు ఉద్యమం చేపడతాం

0 1,190

న్యూ డెమోక్రసి జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య డిమాండ్.

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఎన్ఎస్ఎఫ్ మరియు ఎన్సిఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీలని తెరవకపోతే భవిష్యత్తులో వందలాది టాక్టర్లతో రైతు ఉద్యమం చేపడతామని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య తెలియజేశారు. అఖిల భారత రైతు కూలీ సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారంపాత కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్న ధర్నా చౌక్ లో రెండువందల మంది రైతులతో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీగా ఇచ్చిన, జిల్లాకు చెందిన రెండు షుగర్ ఫ్యాక్టరీలను వెంటనే తెరిపించాలని డిమాండ్ చేశారు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలో గల రెండు చక్కర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని, దాని కొరకు సబ్ కమిటీ వేసి కాలాయపన చేస్తూ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. బోధన్ లో ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వమే సాధీనం చేసుకొని వెంటనే ప్రారంభించాలని, షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో ఉన్న రైతులకి చెరుకు పంట వేయడానికి అవసరమైన అడ్వాన్సులు, బోనస్ లు ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నిజామాబాద్ నగరానికి సమీపంలో, సారంగాపూర్ లో ఉన్న సహకార చక్కెర పరిశ్రమను బెల్లం పరిశ్రమగా మార్చి వెంటనే ప్రారంభించాలని, రైతులకు అవసరమైన ప్రోత్సాహకాలు అందించాలని డిమాండ్ చేశారు.  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను చేపడుతున్నారని, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తెచ్చిన మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతు ఉద్యమానికి ఇచ్చిన లిఖితపూర్వక హామీని విస్మరించిందని అన్నారు. ఎంఎస్పీ మద్దతు ధరల గ్యారెంటీ  చట్టాన్ని తీసుకువచ్చి రైతుల అప్పులన్నీ మాఫీ చేయాలని, రైతులను రుణ విముక్తి చేయాలని కోరారు. భారత ఆహార సంస్థ  ని విస్తృతపరచాలని డిమాండ్ చేశారు. పంట భూములను పరిశ్రమలకు కేటాయించవద్దని బహుళ జాతి కంపెనీలకు లేదా వాటి ఆశ్రిత బిడ్డలైన  అదాని, అంబానీలకు కట్టబెట్టాలని చూస్తుందని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలని అందులో భాగంగా జిల్లాకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించాలని డిమాండ్ చేశారు. అఖిలభారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాలకు తగినన్ని నిధులు కేటాయించాలని అన్నారు.గత ప్రభుత్వం గొల్ల కురుమలకు 20 గోర్లు రెండు పొట్టేలుని ఇచ్చారని, అది ఏమాత్రం సరిపోనందున 100 గొర్లు ,5 పొట్టేలు ఇయ్యాలని, పశుక్రాంతి పథకం కింద పాడి రైతుకు 10 గేదెలు ఇవ్వాలని, వీటికోసం ఎస్సీ ఎస్టీ పాడి రైతులకు 80% మిగతా వారికి 50 శాతం సబ్సిడీ అందించాలని డిమాండ్ చేశారు. వేలాది ఎకరాలలో అసైన్ భూములకు డిజిటల్ పాస్ బుక్  రాక రైతులు రైతుబంధు, బీమా సౌకర్యాలు పొందలేకపోతున్నారని వెంటనే వాటినీ సర్వే చేసి  అర్హులైన వారందరికీ పాసుబుక్ ఇవ్వాలని కోరారు. ధరణి లో ఉన్న లోపాలను తొలగించాలని, పెండింగ్ ఉన్న రైతులందరికీ డిజిటల్ పాస్ బుక్ లు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో రైతు నాయకులు ఎఫ్ పి ఓ చైర్మన్ మచ్చర్ల నాగయ్య, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టీ సాయి రెడ్డి, ఉపాధ్యక్షులు బి.సాయిలు, పర్వయ్య,అగ్గు ఎర్రన్న, దేవన్న, టి.కృష్ణ గౌడ్ డి.బన్సీ , మార్క్స్, బాబురావు,శ్రీనివాస్ రెడ్డి ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకుల అరుణ, సుప్రియ వేల్పూర్ లక్ష్మి, ఐ ఎఫ్ టి యు నాయకులు సూర్య శివాజీ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

If the sugar factories are not opened, we will take up the farmers' movement

Leave A Reply

Your email address will not be published.