- కూతురి మృతదేహం చుట్టూ క్షుద్రపూజలు చేసినట్లు సృష్టించిన కిల్లర్ లేడీ
జయశంకర్ భూపాలపల్లి, బతుకమ్మ : ప్రియుడి మోజులో పడి భర్తను, 22ఏళ్ల కూతురిని ఓ కసాయి తల్లి హత్య చేసిన దారుణ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వడితల గ్రామంలో చోటుచేసుకుంది. భర్త పక్షవాతంతో బాధపడుతుండగా, అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో కవిత అనే మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ వివాహేతర సంబంధం గురించి తెలుస్తుందని భర్తను జూన్ 25న చంపి వ్యాధితో చనిపోయాడని నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేసింది. వివాహేతర సంబంధం విషయం కూతురికి కూడా ఎలాగైనా తెలుస్తుందని, ప్రియుడితో కలిసి వర్షిణి(22)ని కూడా కడతేర్చింది. కూతురు మృతదేహాన్ని భూపాలపల్లి – కాటారం హైవే పక్కన అడవిలో పడేసి, చుట్టూ నిమ్మకాయలు, పసుపు, కుంకుమ చల్లి ఆధార్ కార్డు పెట్టి నరబలిలా నమ్మించింది. పోలీసుల దర్యాప్తులో కవిత తీరుపై అనుమానం వచ్చి ఆరా తీయగా విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. 2 నెలల క్రితం ప్రియుడితో కలిసి భర్తను, ఇప్పుడు కూతురిని హత్య చేసినట్లు కిల్లర్ లేడీ ఒప్పుకుంది. మరో హత్య కోసం కూడా ప్లాన్ చేసినట్లు తెలిసింది. ప్రియుడిని, కవితను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు.
