. . . ఆత్మహత్య చేసుకున్న ఖైది కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షలు చెల్లించాలి
హైదరాబాద్, బతుకమ్మ :
జైలులో ఉన్న రిమాండ్ ఖైదీ ఆత్మహత్యకు అధికారుల నిర్లక్ష్యం కారణమని అతని కుటుంబానికి ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ సంచలన తీర్పు వెలువరించింది. నిజామాబాద్ సెంట్రల్ జైలులో మక్కల హనుమంతు అనే రిమాండ్ ఖైదీ టెలిఫోన్ వైర్ తో 2017 లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన కొడుకు ఆత్మహత్యపై తండ్రి లక్ష్మన్ మానవహక్కుల కమీషన్ లో ఫిర్యాదు చేశారు. రిమాండ్ ఖైదీ ఆత్మహత్యపై జరిగిన జ్యూడిషియల్ విచారణ రిపోర్టు తో పాటు ప్రాథమిక సాక్ష్యాల ఆధారంగా కమీషన్ విచారణ జరిపింది. జైలులో దొరికిన టెలిఫోన్ వైర్ కారణంగానే హనుమంతు ఆత్మహత్యకు పాల్పడ్డారని ధ్రువీకరించింది. రిమాండ్ లో ఉన్న ఖైదీల ప్రాణరక్షణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, ఆర్టికల్ 21 ప్రకారం అండర్ ట్రయల్ ఖైదీలకు జీవించే హక్కు వర్తిస్తుందని కమీషన్ చైర్మన్ జస్టీస్ షమీమ్ అక్తర్ పేర్కొన్నారు. జైలు అధికారుల నిర్లక్ష్యం వలననే టెలిఫోన్ వైర్ తో హన్మంతు ఉరి వేసుకున్నాడని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరణించిన హన్మంతు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వ ప్రదాన కార్యదర్శికి కమీషన్ సిఫారసు చేశారు.
