. . . కళ్ళు నెత్తికెక్కాయా . . . దీమాక్ ఖరాబ్ అయిందా పోలీసులకు
. . . అధికారుల తీరుపై ఫిర్యాదు చేస్తాం
. . . 257 పోలింగ్ బూత్ లో ఎంపీ అరవింద్ హల్చల్
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ నగరంలో దొంగ ఓట్లు వేస్తున్నారని సమాచారంతో పోలింగ్ కేంద్రానికి వచ్చిన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ పోలీసులపై, పోలింగ్ బూత్ లోని అధికారులపై మండిపడ్డారు. బుధవారం సాయంత్రం నగరంలోని హరి చరణ్ మార్వాడి స్కూల్ లోని 257 పోలింగ్ బూత్ లో కొందరు దొంగ ఓట్లు వేస్తున్నారని తనను అధికారులు, పోలీస్ లు బయటకు పంపారని బీజేపీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్(పండు) ఎంపీ అరవింద్ కు ఫోన్ లో సమాచారం అందించారు. ఎంపీ పోలీస్ అధికారులపై విరుచుకుపడ్డారు. పోటీలో ఉన్న అభ్యర్థిని పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లకుండా ఎలా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్ళు నెత్తికెక్కాయా ధీమాక్ గిట్ల కరాబ్ అయిందా అంటూ మండిపడ్డారు. క్యాండెట్ ను ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. అనంతరం పోలింగ్ బూత్ లోని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు పోటీలో ఉన్న అభ్యర్థి పోలింగ్ కేంద్రంలో ఉండొచ్చని నిబంధన తెలియదా అని నిలదీశారు. ఇతరులు దొంగ ఓట్లు వేస్తుంటే ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. వెబ్ కాస్టింగ్ ఉండగా ఎలా అక్రమాలు జరుగుతున్నాయని అధికారులను నిలదీశారు. ప్రతి ఒక్క ఓటర్ ను పరిశీలించిన తర్వాతనే ఓటు వేసేందుకు అనుమతివ్వాలని అధికారులకు సూచించారు. అధికార పార్టీకి వత్తాసు పలికిన వారిపై ఫిర్యాదు చేయనున్నట్టు పేర్కొన్నారు. అలాగే బూత్ నం.7లో శంకర్ అనబడే కానిస్టేబుల్, ఒక మున్సిపల్ ఉద్యోగి, కాంగ్రెస్ కి ఓటేయాలని ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని తెలిసి వచ్చింది. ఈ విషయమై ఎంపీ ఏసీపీతో మాట్లాడారు. మీ కానిస్టేబుల్ తప్పు చేస్తే మీరు చేసినట్లేనని అన్నారు.

