. . . ఉమ్మడి జిల్లాలో బల్దియా ఎన్నికల లో రగడ
. . . పోలింగ్ కేంద్రాల వద్ద అధికార పార్టీ ఆధిపత్యం
. . . అధికార పార్టీ అండతో రెచ్చిపోయిన మజ్లిస్
. . . దొంగ ఓట్లపై కేసుల నమోదు
. . . పోలింగ్ కేంద్రాల వద్ద లాఠీలకు పని చెప్పిన ఖాకీలు
. . . ఎల్లారెడ్డి లో మాజీ ఎమ్మెల్యే ఆందోళన అరెస్ట్
. . . నగరంలో పోలింగ్ కేంద్రం వద్ద ఎంపీ అర్వింద్ హల్ చల్
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో జరిగిన పురపోరు ఉద్రిక్తల మధ్య సాగింది. బుధవారం ఉదయం నుంచి తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించామన్న పోలీసులకు బల్దియా ఎన్నికలు తీవ్ర షాక్ ను ఇచ్చాయి. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ నగర ప్రాంతాల్లో జరిగిన మున్సిపల్ ఎన్నికలు ఉద్రిక్తల మధ్య జరిగాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు కామారెడ్డి, ఆర్మూర్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, భీంగల్, బిచ్కుంద మున్సిపాలిటీలలో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో అధికార కాంగ్రెస్ పార్టీ పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణకు దిగింది. నగరంలోని 11వ డివిజన్లో పతంగి పార్టీ కాంగ్రెస్ పార్టీలు గొడవపడ్డాయి. రెండు పార్టీల కార్యకర్తల ఘర్షణలో కాంగ్రెస్ అభ్యర్థి కరీంకు గాయాల య్యాయి.

59వ డివిజన్ లో నూ ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓటర్ల ఓట్లు కొందరు గొడవకు దిగారు. అక్కడ మజ్లిస్, కాంగ్రెస్ పార్టీలు గొడవపడ్డాయి. పోలీసులు జోక్యం చేసుకుంటే గానీ వివాదం సద్దుమనుగ లేదు. పలు మైనార్టీ డివిజన్ లో నూ ఉదయం నుంచి ఘర్షణ వాతావరణం నెలకొంది. గూపన్ పల్లి వద్ద బిఎన్ఎస్ 163 సెక్షన్ ను ఉల్లంఘించి అన్ని పార్టీల కార్యకర్తలు గుమిగుడారు. దానితో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. మాలపల్లి లో పోలింగ్ కేంద్రం వద్ద ఎమ్ఐఎమ్ నగర కార్యదర్శి షహబాజ్ పై కాంగ్రెస్ నేత అనుచరులు దాడి చేసారు. బోధన్ పట్టణం లో 20, 21 వ వార్డులలో అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గొడవపడ్డారు. పోలీసులు లాటి చార్జీ చేసి అల్లరి మూకలను చెదరగొట్టారు. నగరంలోని హరిచరణ్ మార్వాడి స్కూల్ వద్ద గల పోలింగ్ బూత్ లో క్యాండిటేట్ ను బయటకు పంపించిన విషయం తెలిసిన ఎంపీ అర్వింద్ అక్కడ పోలిస్ అధికారులు, బూత్ లెవల్ అధికారులపై మండిపడ్డారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫోన్ లో ఫిర్యాదు చేశారు.

కామారెడ్డి జిల్లాలోని అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ మధ్య పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణ జరిగింది. కామారెడ్డి లోని 9వ వార్డులో కల్కి నగర్ లో బిజెపి కార్యకర్తపై కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యానికి పాల్పడడంతో గాయాలు అయ్యాయి. బాన్సువాడ పట్టణంలోని 9వ వార్డులో అధికార పార్టీకి ఓటు వేయాలని ప్రచారం చేయడాన్ని బిజెపి, బీఆర్ఎస్ లు అడ్డుకున్నాయి.

ఎల్లారెడ్డి పట్టణంలోని పోలింగ్ కేంద్రాలలోకి అధికార పార్టీ ఎమ్మెల్యే మంది మార్బలంతో వెళ్లడాన్ని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు. ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడిన ఎమ్మెల్యే మదన్ మోహన్ పై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే సురేందర్ ఆధ్వర్యంలో గులాబీ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అరెస్టు చేసి లింగంపేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలలో బోగస్ ఓటర్ల వ్యవహారం వెలుగు చూసింది. అధికార పార్టీ నాయకులు తమ పార్టీ గెలుపు కోసం దొంగ ఓట్లు వేయిస్తున్నారని బోధన్ పట్టణంలో ఇద్దరినీ పట్టుకొని పోలీసులకు అప్పగించారు. నిజామాబాద్ నగరంలోని ఖిల్లా రోడ్ లో ఇతరుల ఓటును వేసేందుకు యత్నించిన యువతిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. రెండు ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో సజావుగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ గట్టి ప్రయత్నాలు చేసినా విఫలమయ్యాయి. పోలీసులు అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. పలు ప్రాంతాల్లో పతంగి పార్టీ గొడవలకు దిగిన పోలీసులు మౌనం వహించారని విమర్శలు వచ్చాయి. మెజార్టీ ప్రాంతాల్లో మాత్రం ఎన్నికలు ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా జరిగాయి. ఎన్నికల బ్యాలెట్ బాక్స్ లను స్ట్రాంగ్ రూంలకు తరలించారు.
