. . . ఇద్దరు మహిళలు మృతి
. . . ఆగి ఉన్న టూరిస్ట్ బస్సును ఢీకొన్న లారీ
. . . సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సీపీ
ఆర్మూర్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల పరిధిలోని గోవింద్‌పేట్ బ్రిడ్జి సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టైర్ పంచర్ కావడంతో జాతీయ రహదారిపై ఆగి ఉన్న టూరిస్ట్ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ ప్రాంతానికి చెందిన భక్తులు హైదరాబాద్‌లోని చిన్న జీయర్ స్వామి దర్శనం కోసం రెండు టూరిస్ట్ బస్సుల్లో బయలుదేరారు. గోవింద్‌పేట్ బ్రిడ్జి సమీపంలో ముందుగా వెళ్తున్న టూరిస్ట్ బస్సు టీజీ 01 టీ 1864 టైర్ పంచర్ కావడంతో టీజీ 21 టీ 2172 సహా బస్సులను జాతీయ రహదారిపై నిలిపారు. టైర్ పంచర్ కావడంతో కొంతమంది ప్రయాణికులు బస్సు నుంచి దిగి రహదారి మధ్యలోని డివైడర్‌పై కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ జీటీ 27 టీఎఫ్ 7482 డ్రైవర్ ఆగి ఉన్న బస్సును సకాలంలో గుర్తించక పోవడంతో బలంగా ఢీకొట్టాడు. లారీ ఢీకొట్టిన ప్రభావంతో ఆగి ఉన్న బస్సు ముందుకు కదిలి డివైడర్‌పై కూర్చున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో సుజాత (54), మాధవి (47) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. సునీత, చిటక్క అనే మరో ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడటంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

. . . సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్
ప్రమాద సమాచారం అందుకున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాహనాలు ఏ విధంగా నిలిపి ఉన్నాయనే అంశంతో పాటు లారీ బస్సును ఢీకొన్న తీరును అధికారులు కమిషనర్‌కు వివరించారు. సహాయక చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన విధానాన్ని కూడా ఆయన పరిశీలించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

. . . వాహనాలు నిలిపే సమయంలో జాగ్రత్తలు అవసరం
జాతీయ రహదారులపై టైర్ పంచర్ లేదా ఇతర సాంకేతిక సమస్యల కారణంగా వాహనాలను నిలిపే సమయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. వాహనం ఆగిపోయిన వెంటనే ప్రమాద హెచ్చరిక లైట్లు ఆన్ చేయడంతో పాటు, తగిన దూరంలో రిఫ్లెక్టివ్ వార్నింగ్ ట్రయాంగిల్స్ లేదా ఇతర హెచ్చరిక సూచికలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రయాణికులు రహదారిపైకి వచ్చి డివైడర్లు లేదా రహదారి పక్కన కూర్చోవడం అత్యంత ప్రమాదకరమని, వాహనం ఆగిపోయినప్పుడు సురక్షితమైన ప్రదేశంలో ఉండాలని సూచించారు. ప్రమాదంపై సంబంధిత పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం తదితర అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ ఎస్‌హెచ్‌ఓ సత్యనారాయణ, ఆర్మూర్ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ రాహుల్ కుమార్, ఆర్మూర్, జక్రాన్‌పల్లి, బాల్కొండ ఎస్‌ఐలు, అసిస్టెంట్ ఎంవీఐ తదితరులు పాల్గొన్నారు.

