27.8 C
Hyderabad

సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీని వెంటనే పునఃప్రారంభించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . చెరకు ఉత్పత్తి దారుల సంఘం కన్వీనర్ ఆకుల పాపయ్య

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :

 

మూతపడిన సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీని వెంటనే పునఃప్రారంభించి, రైతుల ప్రయోజనాలను కాపాడే విధంగా ప్రభుత్వమే నిర్వహించాలని చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్ ఆకుల పాపయ్య డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీని ఆధునీకరించి చక్కెరతో పాటు బెల్లం, ఇతర అనుబంధ ఉత్పత్తుల తయారీకి అవకాశం కల్పించాలని కోరారు. గురువారం సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీ ఆవరణలో చెరుకు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సమ్మేళనంలో సుమారు 180 మంది రైతు సంఘాల నాయకులు, రైతులు, వ్యవసాయ కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1964లో రైతుల వాటాలతో, ప్రభుత్వ సహకారంతో ఏర్పాటైన సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీ దశాబ్దాలుగా వేలాది మంది రైతులు, కార్మికులకు జీవనాధారంగా నిలిచిందన్నారు. 2008 లో ఫ్యాక్టరీ మూతపడటంతో రైతులు, కార్మికులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ఫ్యాక్టరీ మూతపడిన తర్వాత చెరకు సాగు తగ్గిపోయి రైతులు ఇతర పంటల వైపు మళ్లారని చెప్పారు. గతంలో ఫ్యాక్టరీకి 23,143 మంది రైతులు సభ్యులుగా ఉండేవారని, ప్రతి ఏడాది 5 వేల నుంచి 6 వేల మంది రైతులు చెరకును సరఫరా చేసేవారని తెలిపారు. ఫ్యాక్టరీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి పైగా ఉపాధి లభించేదన్నారు. రైతుల వాటాలతో ఏర్పాటైన పరిశ్రమను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించకుండా ప్రభుత్వం నిధులు కేటాయించి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రైతులు తిరిగి చెరకు సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, ప్రభుత్వం ఫ్యాక్టరీని పునఃప్రారంభించి చెరకు కొనుగోలుకు హామీ ఇస్తే ఈ ప్రాంతంలో చెరకు సాగు మళ్లీ పుంజుకుంటుందని అన్నారు. ఫ్యాక్టరీని ఆధునీకరించి చక్కెరతో పాటు బెల్లం వంటి అనుబంధ ఉత్పత్తులను తయారు చేస్తే రైతులకు మెరుగైన మార్కెట్, ధరలు లభించడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీలు ఇచ్చినా అమలు చేయలేదని, ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇప్పటివరకు స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడం పట్ల రైతుల్లో అసంతృప్తి నెలకొందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్‌కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకుని ఫ్యాక్టరీ పునఃప్రారంభంపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఏఐకెఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమన్న, రైతు నాయకుడు సిరిపూర్ గంగారెడ్డి మాట్లాడుతూ ఫ్యాక్టరీ పునఃప్రారంభమైతే సుమారు 10 వేల మంది రైతులు, వ్యవసాయ కార్మికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అన్నారు. రైతులు చెరకు సాగుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఫ్యాక్టరీ మూతపడటం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇకనైనా ఆలస్యం చేయకుండా ఫ్యాక్టరీని వెంటనే ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. పునఃప్రారంభంపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే రైతులను సమీకరించి వందలాది ట్రాక్టర్లతో “చలో నిజామాబాద్” కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. రైతులు, వ్యవసాయ కార్మికుల జీవనాధారమైన ఫ్యాక్టరీ కోసం జరిగే పోరాటానికి అందరూ ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు. బికెఎస్ అధ్యక్షుడు కొండేలా సాయిరెడ్డి మాట్లాడుతూ సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ఫ్యాక్టరీ తెరవడానికి తన వంతు సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. రైతు సమ్మేళనంలో ఫ్యాక్టరీ పునఃప్రారంభం, చెరకు సాగు ప్రోత్సాహం, రైతుల సమస్యల పరిష్కారం తదితర అంశాలపై పలు తీర్మానాలు చేసి ఫ్యాక్టరీ ఎండీకి అందజేశారు. మూతపడిన ఫ్యాక్టరీని పునఃప్రారంభించి బెల్లం కేంద్రంగా మార్చి ప్రభుత్వమే నిర్వహించాలని, రైతులను చెరకు సాగు వైపు ప్రోత్సహించాలని, ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి రూ.100 కోట్ల నిధులు కేటాయించాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో చెరుకు ఉత్పత్తిదారుల సంఘం నాయకులు ఆర్. పృధ్వీరాజ్, ఫాల్దా రాజారెడ్డి, బి. లక్ష్మారెడ్డి, వై. సంతోష్, టేక్మల్ లక్ష్మణ్, కొట్టే గంగాధర్, సిర్ప నాగయ్య, బి. సాయిలు, అగు ఎర్రన్న, అర్సపల్లి గోపాల్ తదితరులు, రైతులు, వ్యవసాయ కార్మికులు పాల్గొన్నారు.

 

The Sarangapur sugar factory must be restarted immediately.

More articles

Latest article