29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

జూన్ 19 నుంచి తెలంగాణలో భారీ వర్షాలు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

 

. . . మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

రాష్ట్రంలో జూన్ 19వ తేదీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో విపత్తుల నిర్వహణ యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాకాలం సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు ఎదురుకాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన తర్వాత స్పందించడం కంటే, వాటి ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి నివారణ చర్యలు చేపట్టడం అత్యంత కీలకమని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు రెవెన్యూ, విపత్తుల నిర్వహణ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంచాలని ఆదేశించారు. నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయని, రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల్లో తెలంగాణ అంతటా వ్యాపించే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ముఖ్యంగా జూన్ 19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు ఊపందుకుని వారం రోజులపాటు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ అంచనాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సోమవారం అన్ని జిల్లాల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల మీదుగా ఉత్తర దిశగా కొనసాగుతున్నాయని, జూన్ 14 నాటికి దక్షిణ తెలంగాణలోని అన్ని జిల్లాలు, మధ్య తెలంగాణలోని చాలా ప్రాంతాలను తాకినట్లు వివరించారు. రాష్ట్రంలో జూన్ 1 నుంచి ఇప్పటివరకు 49.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, సాధారణ వర్షపాతం 54.9 మిల్లీమీటర్లతో పోలిస్తే సుమారు 10 శాతం లోటు ఉన్నట్లు వెల్లడించారు. వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికలను నిరంతరం పరిశీలిస్తూ జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, విపత్తుల నిర్వహణ శాఖ సిబ్బందితో సమన్వయం కొనసాగించాలని మంత్రి ఆదేశించారు. వర్షాల తీవ్రత పెరిగే అవకాశమున్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొంటూ, వర్షాకాలం ముగిసే వరకు అన్ని జిల్లాల అధికారులు నిరంతర అప్రమత్తతతో పనిచేయాలని ఆదేశించారు.

More articles

Latest article