- రెండేళ్లు పూర్తి, అందులో 50 శాతం,
- నేడు జాబితా., 29, 30న అభ్యంతరాలు 4లోపు పోస్టింగ్ కోసం వినతి,
- 7న బదిలీ ఉత్తర్వులు, 9న రిలీవ్..
నిజామాబాద్ బతుకమ్మ : విద్యుత్ శాఖలో బదిలీలు జరిపేందుకు కంపెనీ సీఎండివరుణ్ రెడ్డి మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను జారీ చేశారు. మూడు నెలలుగా బదిలీలు ఎప్పుడు అవుతాయా అనే ఎదురు చూస్తున్న ఉద్యోగులకు శుక్రవారం వచ్చిన ఉత్తర్వులతో ఊపిరి పీల్చుకున్నట్లయింది. ఉత్తర్వులలో పొందుపరిచిన ప్రకారం 30/6/2022 నాటి నుంచి రెండేళ్లు నిండిన వారే బదిలీ అయ్యేందుకు అవకాశాలుంటాయి. దీనిలోనూ 50 శాతానికి మించకుండా సిబ్బందిని మాత్రమే బదులు చేయనున్నారు. రెండేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగుల అర్హులైన వారి జాబితాలను నేడు ప్రకటించనున్నారు. 29, 30 తేదీలలోపు ప్రకటించిన జాబితాలో తప్పులు దొర్లినట్లయితే వాటిపై అభ్యంతరాలు అందజేయడానికి అవకాశం ఇచ్చారు. అక్టోబర్ 1 నుంచి 4 వరకు పోస్టింగ్ కై సరైన ఛానల్ (త్రో ప్రాపర్ చానల్) ద్వారా అనుకూలమైన ప్రాంతం కోసం ఆర్జీలను సమర్పించాల్సి ఉంటుంది. 7న బదిలీ ఉత్తర్వులను అందజేసి, 9న రిలీవ్ చేయాలని సీఎండీ జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు. బదిలీల ప్రక్రియపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

