- రాణంపల్లి గ్రామంలో పేరుకుపోయిన చెత్త చెదారం
- పట్టించుకోని అధికారులు
రుద్రూర్, బతుకమ్మ : గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీలకు చెత్త ట్రాక్టర్లను అందించి గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టి గ్రామాలు అందంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంది. కానీ ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామాల్లో పారిశుధ్య పనులు కొనసాగడం లేదు. చెత్త సేకరణ ట్రాక్టర్లు మరమ్మత్తుల దశకు చేరి మూలాన పడ్డాయి. రుద్రూర్ మండలం రాణంపల్లి గ్రామంలో గత సంవత్సరం నుండి గ్రామ పచాయతీ ట్రాక్టర్ మరమ్మత్తుల దశకు చేరడంతో గ్రామంలో చెత్త సేకరణ నిలిచిపోయి, అది దిష్టిబొమ్మలా మారింది. ట్రాక్టర్ చెడిపోగా, దీన్ని రిపేర్ చేయించే నాథుడే కరువయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే వీటికి బాధ్యత వహించే సర్పంచులు లేక ప్రత్యేక అధికారుల పాలన దిగజారుతోందని స్పష్టంగా తెలుస్తుంది. ట్రాక్టర్ మరమ్మతులు చేయించాలని సంబంధిత పంచాయతీ సెక్రటరీకి తెలిపిన కూడా పట్టించుకోవడం లేదని స్థానికులు తెలిపారు. ఏ అధికారి కూడా స్పందించకపోవడంతో ట్రాక్టర్ నిరుపయోగంగా మూలన పడినట్లు చెప్పారు. దీంతో గ్రామంలో చెత్త సేకరణ నిలిచి, ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారంతో వీధులు కంపు కొడుతున్నాయని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వంలో గ్రామపంచాయతీకి తగినన్ని నిధులు కూడా మంజూరు లేక గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌కు మరమ్మత్తులు చేయించి ఉపయోగంలోకి తేవాలని కోరుతున్నారు.

