బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : జిల్లాలో నిబంధనలు పాటించని హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని యుఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి పోషమైన మహేష్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు హోటల్ మేనేజ్మెంట్ కళాశాలల యాజమాన్యాలు విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. సంబంధిత శాఖ అధికారులు కనీసం కాలేజీలను తరచుగా తనిఖీలు చేయకపోవడం బాధాకరమన్నారు. కొన్ని ప్రైవేట్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలు జాతీయ హోటల్ నిర్వహణ, క్యాటరింగ్ టెక్నాలజీ కౌన్సిల్ లేదా రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి నుంచి అనుమతి తీసుకోకుండానే కళాశాలలో తరగతులు నిర్వహిస్తున్నారని ఆరోపణలు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు విదేశాల్లో అత్యుత్తమైన హోటల్స్లో ఉపాధి కల్పిస్తామని మాయ మాటలు చెప్పి లక్షలకు లక్షలు తీసుకొని వారికి సరైన విద్యను అందించడంలేదన్నారు. సంబంధిత శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని ప్రవేటు హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యూఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షులు గణేష్ నగర ఉపాధ్యక్షులు వేణు, నాయకులు విశాల్, బాబురావు తదితరులు పాల్గొన్నారు.
