- కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలి
- సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ నగర కార్యదర్శి ఎం.సుధాకర్
నిజామాబాద్, బతుకమ్మ : ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో తరచూ జరుగుతున్న వివాదాస్పద ఘటనలపై ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం తక్షణమే స్పందించాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ పార్టీ నగర కార్యదర్శి ఎం.సుధాకర్ డిమాండ్ చేశారు. సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నగర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఎన్.ఆర్ భవన్, కోటగల్లిలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ పార్టీ నగర కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ జీజీహెచ్ లో తరచూ వివదాస్పద ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నుండి, జిల్లా అధికారుల నుండి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. శుక్రవారం రోజు రెంజల్ మండలం కల్యాపూర్ గ్రామానికి చెందిన మహిళా తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రికి వస్తే, చేర్పించుకోవడానికి సిబ్బంది నిరాకరించడం, సిటీ స్కాన్ సిబ్బంది లేకపోవడం, ఎమ్మెల్యే కలగజేసుకుంటే గాని ఆసుపత్రి సిబ్బంది స్పందించక పోవడం సిగ్గుచేటన్నారు. సోషల్ మీడియాలో ఆసుపత్రి సిబ్బంది వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నా, ఏమాత్రం పట్టించుకోని జీజీహెచ్ సూపరింటెండ్ గారు నిన్న శనివారం రోజున తన కార్యాలయాన్ని పుట్టినరోజు వేడుకలకు వేదికగా మార్చుకోవడం, వైద్యులు, సిబ్బంది సైతం పేషెంట్లను వదిలి శుభాకాంక్షలు చెప్పడానికి పోటీలు పడడం సరికాదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నిరుపేదలకు చికిత్స సంగతి అటుంచి, కనీసం ప్రవేశం దొరకడం లేదని ఆరోపించారు. కనీసం స్ట్రెచర్లు అందుబాటులో లేవని, సిటీ స్కాన్ ఆపరేటర్లు సరిపడా లేకపోవడం, ఎమ్మారై యంత్రం లేకపోవడం వల్ల పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మల, మూత్రశాలలు అత్యంత దుర్గంధ పూరితమయ్యాయన్నారు. పేషెంట్లకు నాశిరకం భోజనం పెడుతున్నారన్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రిలో నిధుల దుర్వినియోగం, నిబంధనల ఉల్లంఘనలపై అనేక ఆరోపణలు ఉన్నాయన్నారు. వీటిపై సమగ్ర దర్యాప్తు జరపాలని జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ గార్లకు పార్టీగా ఫిర్యాదు చేశామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిపై జిల్లా ప్రజా ప్రతినిధులు సీరియస్ గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా కలెక్టర్ గారు వెంటనే సమగ్ర దర్యాప్తుకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, జిల్లా అధికారులు స్పందించకపోతే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ నగర నాయకులు వి.గోదావరి, కే.సంధ్యారాణి, కే.గణేష్, ఎం.సాయిబాబా, నర్సక్క అశోక్ తదితరులు పాల్గొన్నారు.