- సిర్పూర్ లో చింతోడికుంట మాయం
- సర్వే నంబర్ 602లో 9 ఎకరాలు కబ్జా
- సర్కార్ ఇచ్చిన ఇళ్ళ స్థలాల అమ్మకం
- రెవెన్యూ, ల్యాండ్ సర్వే అధికారుల అండతో రెచ్చిపోయిన గులాబీ నేత
- చర్యలు తీసుకోవాలంటున్నకాంగ్రెస్ నాయకులు

నిజామాబాద్, బతుకమ్మ :
ఆయన ఒక మాజీ గ్రామ ప్రజాప్రతినిధి. ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీకి మండలాధీశుడు. అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు అడ్డు లేదు. ఏకంగా సర్కారు, అసైన్డ్ , పేదలకు ఇచ్చిన ఇళ్ళ స్థలాలతో పాటు చెరువులను కూడా వదలకుండా చెరబట్టాడు. అధికారం ఉన్నప్పుడు ఆయనతో అంటకాగిన రెవెన్యూ, ల్యాండ్ సర్వే అధికారులకు పోలీసులు కూడా తోడవ్వడంతో ఆయన కన్నుపడితే సిర్పూర్ గ్రామంలో భూములకు రెక్కలొచ్చాయి. ప్రభుత్వ, ప్రైవేట్ భూములని తేడా లేకుండా ఆయన కబందహస్తాల్లో చిక్కుకున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా భూములను మాయం చేశాడో అధికారం లేకున్నా కూడా అధికారుల అండతో వాటిపై కబ్జాను కొనసాగిస్తున్నాడు.
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని సిర్పూర్ గ్రామంలో ఎకరాలకొద్ది భూములు అన్యక్రాంతమయ్యాయి. కబ్జాకు గురయ్యాయనేకంటే అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని కబ్జా చేశారని గ్రామమంతా కోడైకూస్తోంది. సామాన్యుడు వంద గజాల సర్కారు భూమిని చెరబడితే కేసులు గట్రాపెట్టి వేదించే యంత్రాంగం సిర్పూర్ గ్రామంలోనే కోట్ల విలువ చేసే భూములను ఒక వ్యక్తే కబ్జా చేస్తే మౌనంగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. సిర్పూర్ గ్రామంలో చింతోడికుంట అనే చెరువు బీఆర్ఎస్ నేత కబంధహస్తాల్లో కుచించుకపోయింది. ఏడు ఎకరాల 36 గుంటల విస్తీర్ణంలో ఉన్న కుంటను చెరబట్టి ఐదు ఎకరాలను కబ్జా చేశాడు. గ్రామస్తులకు సాగునీరందించే గొలుసుకట్టు చెరువును కబ్జా చేశాడు. అంతేగాకుండా సిర్పూర్, ముదక్ పల్లి రోడ్డును ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 602లో 9 ఎకరాల అసైన్డ్ భూమిని చెరబట్టాడు. దాదాపు సంబంధిత భూమి రూ.5 కోట్ల విలువైన భూమిని కబ్జా చేశాడు. అదీచాలదన్నట్లు గ్రామంలో పేదలకు ఇచ్చిన ఇళ్ళ స్థలాలను బహిరంగంగా అమ్ముకున్నారు.
మోపాల్ మండలంలో సిర్పూర్ గ్రామంలో నీటి పారుదల శాఖ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన విలువైన భూములను కబ్జా వెనుక రెవెన్యూ, నీటి పారుదల శాఖ భూములను చెరబట్టడానికి ఆయా శాఖల అధికారుల అండదండలు ఉన్నాయి. రెవెన్యూ కార్యాలయం మొదలుకుని ల్యాండ్ సర్వే అధికారులు, నీటి పారుదల శాఖాధికారుల అండతో గత కొన్ని రోజులుగా సంబంధిత భూములను కబ్జా చేసినా, సాగు చేస్తున్నా, అమ్ముకుంటున్నా అడిగే నాథుడు లేడు. తాజాగా 602/1లో రెవెన్యూ రికార్డులో మురబ్బాగా ఉన్న 2 ఎకరాల భూమిని బహిరంగంగా అమ్మకానికి పెట్టాడు. ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు అక్కడ గెస్ట్ హౌజ్ ను నిర్మించిన సదరు బీఆర్ ఎస్ నేత అసైన్డ్ భూమిని రూ.15 లక్షలకు అమ్మకానికి పెట్టడం కలకలం రేపుతోంది. అధికారంలో ఉన్నప్పుడు అక్కడ గ్రామంలో వేయాల్సిన వీధి దీపాల స్తంబాలను తన కబ్జా స్థలంలో వేసుకుని అధికార దుర్వినియోగానికి తెర లేపారు. ఏకంగా సబ్ డివిజన్ వేరుగా ఉన్న అసైన్డ్ భూమి పట్టా పేరుతో విద్యుత్ మీటర్ ను కూడా అక్రమంగా పొందడమే కాకుండా అక్కడ మొరం గుట్టను ఖాళీ చేసి లక్షలు వెనుకేశాడనే ఆరోపణలున్నాయి. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు గులాబీ నేత భూ కబ్జాలపై గుర్రుగా ఉన్నారు. మోపాల్ మండలంలో ప్రభుత్వ అవసరాల కోసం 602లోని 9 ఎకరాల భూమిలో గోదాములను నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యేకు , జిల్లా అధికార యంత్రాంగానికి విన్నవించినట్లు సమాచారం.
