నిజామాబాద్, బతుకమ్మ : జిల్లా కేంద్రంలోని గోల్డెన్ జూబిలీ ప్రైవేటు జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపూడి రవికుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలోని తరగతి గదులను, పరిసరాలను పరిశీలించారు. తరగతి గదులు శుభ్రంగా ఉంచాలని, ఆవరణ లో చెత్త, చెదారం తొలగించాలని యాజమాన్యం ను ఆదేశించారు. కళాశాల కార్యాలయం సిబ్బంది, కళాశాల యాజమాన్యంతో ఇంటర్ విద్య అధికారి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్ బోర్డు నిబంధనల మేరకు కార్యాలయ ఫైల్ లు, రిజిస్టర్లన్నీ కూడా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎలాంటి తప్పిదాలు దొర్లకుండ విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకునీ పని చేయాలన్నారు. అవసరమైన సూచనలు, సలహాలు తీసుకుని జాగ్రత్తగా ప్రతి అంశాన్ని క్రోడీకరించాలని అన్నారు. విద్యార్థుల డేటాను సరిచేసుకునేందుకు సబ్జెక్టులు మార్చుకునేందుకు, ఫోటో సంతకము తప్పిదం దొర్లితే సరిదిద్దుకోవడానికి ఇంటర్ బోర్డు మరో అవకాశం ఇచ్చిందని క్షుణ్ణంగా పరిశీలించి డేటాను కంప్యూటర్లలో నిక్షిప్తం చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ఇంటర్ బోర్డు కమిషనర్ ఆదేశాల మేరకు నిబంధనలను అతిక్రమించిన ఏ కళాశాలపై అయిన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఇంటర్ విద్యా అధికారి శ్రీ తిరుమలపూడి రవికుమార్ అన్నారు. కళాశాల ఆవరణ తో పాటు, తరగతి గదులను, ప్రయోగశాలలను, కనీసం అవసరాల కల్పనపై పర్యవేక్షణ చేశారు. నియమ నిబంధనల ప్రకారం ఫైళ్ళ నిర్వహణ, పాలనాపరమైన అనుమతులు, పరీక్ష ఫీజుల వసూలు, ఇతర అన్ని రిజిస్టర్ లను తనిఖీ చేశారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్, సిబ్బంది, అధ్యాపకులు హాజరయ్యారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సూచించిన మేరకు ప్రణాళిక బద్దంగా బోధన నిర్వహణ జరగాలని ఆదేశించారు.

