. . . మరో మేకకు గాయాలు
కామారెడ్డి, బతుకమ్మ :
విద్యుత్ ప్రమాదం చోటుచేసుకుని ఓ మేక మృతి చెందగా, మరో మేకకు గాయాలైన ఘటన ఆరేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం, బైకారి మల్లయ్య తన మేకలను మేతకు తీసుకెళ్లగా, ట్రాన్స్ ఫార్మర్ సమీపంలో రక్షణ కంచె లేకపోవడంతో విద్యుత్ వైరు తెగిపడి మేకలపై పడింది. దీంతో సుమారు రూ.15 వేల విలువైన ఒక మేక అక్కడికక్కడే మృతి చెందింది. మరో మేకకు తీవ్ర గాయాలు కావడంతో వెటర్నరీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాధితుడు బైకారి మల్లయ్య మాట్లాడుతూ, విద్యుత్ వైర్లు తెగిపడటంతో తన మేక మృతి చెందిందని, మరో మేక గాయపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో తనకు కూడా ప్రాణాపాయం తప్పిందని తెలిపారు. ట్రాన్స్ ఫార్మర్ల వద్ద భద్రతా చర్యలు చేపట్టకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించిన మల్లయ్య, జరిగిన నష్టానికి విద్యుత్ శాఖ అధికారులు బాధ్యత వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా విద్యుత్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
