. . . కన్వీనర్‌గా సందు ప్రవీణ్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న ఆహార కల్తీ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనే లక్ష్యంతో రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజిస్తూ వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి సోమవారం ప్రకటించారు. నిజామాబాద్ నగరంలోని గంగాస్థాన్-2 లో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నిజామాబాద్ జోన్ పరిధిలో పూర్వ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నాలుగు జిల్లాలు, పూర్వ నిజామాబాద్‌కు చెందిన రెండు జిల్లాలు, పూర్వ కరీంనగర్‌కు చెందిన నాలుగు జిల్లాలు, పూర్వ మెదక్‌కు చెందిన మూడు జిల్లాలు కలిపి మొత్తం 13 జిల్లాలను చేర్చినట్లు వెల్లడించారు. ఈ జోన్‌కు కన్వీనర్‌గా సందు ప్రవీణ్‌ను నియమించగా, కో – కన్వీనర్‌లుగా ఎ.ముకుంద్ రెడ్డి, ఓం ప్రకాష్ లను ఎంపిక చేశారు. సంయుక్త కార్యదర్శులుగా వి.ఎన్.వర్మ, మహాదేవుని శ్రీనివాస్, యాటకర్ల దేవేష్, మరేళ్ల శ్రీనివాస్ బాధ్యతలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సాంబరాజు చక్రపాణి మాట్లాడుతూ, ప్రస్తుతం అమల్లో ఉన్న ఆహార కల్తీ నిరోధక చట్టాల్లో కఠినమైన శిక్షల కొరత, నామమాత్రపు జరిమానాలకు మాత్రమే పరిమితమవడం, జిల్లా స్థాయిలో ఆహార పరీక్షా ప్రయోగశాలలు లేకపోవడం, నాణ్యతా పరీక్షల్లో జాప్యం వంటి కారణాల వల్ల ఆహార కల్తీ నియంత్రణలో ఆశించిన ఫలితాలు సాధ్యం కావడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులకు ప్రజల తరపున సహకారం అందించేందుకు, ఆహార కల్తీపై అవగాహన కల్పించేందుకు, ఫిర్యాదులు, సమస్యల పరిష్కారంలో భాగస్వామ్యం కావడానికి జోనల్ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని నూతన కమిటీ సభ్యులు తెలిపారు. నూతనంగా నియమితులైన జోనల్ కన్వీనర్ సందు ప్రవీణ్ మాట్లాడుతూ, నిజామాబాద్ కేంద్రంగా ఉన్న పూర్వ నాలుగు జిల్లాల పరిధిలో కారంపొడి, అల్లం పేస్ట్, పన్నీరు, వంటనూనెల్లో అధికంగా కల్తీ జరుగుతున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. అలాగే హోటళ్లలో ఆహార కల్తీని అరికట్టడంలో ప్రధాన సమస్యగా లైసెన్సులు లేని హోటళ్ల నుంచి ఆన్‌లైన్ ఫుడ్ యాప్‌ల ద్వారా ఫాస్ట్ ఫుడ్, బిర్యానీ వంటి ఆహార పదార్థాలను వినియోగదారులు, ముఖ్యంగా యువత, అధికంగా ఆర్డర్ చేయడమేనని పేర్కొన్నారు. నిఘా లేని ఆహార తయారీ కేంద్రాల్లో తయారవుతున్న పదార్థాల్లో హానికరమైన కల్తీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన హెచ్చరించారు. వినియోగదారుల్లో అవగాహన పెంపొందించడంతో పాటు, ఆహార కల్తీకి సంబంధించిన కేసుల నమోదులో అధికారులకు వినియోగదారుల ప్రతినిధులు పూర్తి సహకారం అందిస్తారని సందు ప్రవీణ్ తెలిపారు.

